ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
కక్కిరేణి(రామన్నపేట) : కక్కిరేణి గ్రామ శివారులో తెలంగాణ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ రాకుండా చూస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గురువారం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన విజ్ఙప్తి మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు జోక్యం చేసుకొని ఈనెల 5న జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసినట్లు చెప్పారు. ప్రజలు పనులు మాని ఆందోళనలు చేయవలసిన అవసరంలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ కమీషన్ల కోసం కంపనీల గురించి తెలుసుకోకుండా అడ్డగోలుగా భూములు కొనుగోలు చేయించడం మానుకోవాలని హెచ్చరించారు. రాంఖీసంస్థకు భూములు అమ్మిన రైతులు వాటిని దున్నుకోవాలని, బయానాలు తీసుకున్న వాళ్లు రిజిస్ట్రేషన్లు చేయకూడదని చెప్పారు. పోలీసులు ఇబ్బందులు పెడితే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను తెలంగాణ ప్రభుత్వం చేయదని వివరించారు. కక్కిరేణి గ్రామప్రజలకు అండగా ఉండేందుకు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుకోసం తక్షణమే తనకోటానుంచి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ దువ్వాసి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గంగుల రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బందెల రాములు, నాయకులు పూజర్ల శంభయ్య, జినుకల ప్రభాకర్, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, బత్తుల క్రిష్ణగౌడ్, వెలిజాల నర్సింహ, వేముల సైదులు, రాంబాబు పాల్గొన్నారు.