kakkireni
-
ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
కక్కిరేణి(రామన్నపేట) : కక్కిరేణి గ్రామ శివారులో తెలంగాణ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ రాకుండా చూస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గురువారం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన విజ్ఙప్తి మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు జోక్యం చేసుకొని ఈనెల 5న జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసినట్లు చెప్పారు. ప్రజలు పనులు మాని ఆందోళనలు చేయవలసిన అవసరంలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ కమీషన్ల కోసం కంపనీల గురించి తెలుసుకోకుండా అడ్డగోలుగా భూములు కొనుగోలు చేయించడం మానుకోవాలని హెచ్చరించారు. రాంఖీసంస్థకు భూములు అమ్మిన రైతులు వాటిని దున్నుకోవాలని, బయానాలు తీసుకున్న వాళ్లు రిజిస్ట్రేషన్లు చేయకూడదని చెప్పారు. పోలీసులు ఇబ్బందులు పెడితే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను తెలంగాణ ప్రభుత్వం చేయదని వివరించారు. కక్కిరేణి గ్రామప్రజలకు అండగా ఉండేందుకు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుకోసం తక్షణమే తనకోటానుంచి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ దువ్వాసి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగుల రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బందెల రాములు, నాయకులు పూజర్ల శంభయ్య, జినుకల ప్రభాకర్, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, బత్తుల క్రిష్ణగౌడ్, వెలిజాల నర్సింహ, వేముల సైదులు, రాంబాబు పాల్గొన్నారు. -
వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఆపాలి
కక్కిరేణి(రామన్నపేట) ప్రజల ప్రాణాలను హరించే అవకాశం ఉన్న తెలంగాణవేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే ఆపాలని మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. బుధవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, శ్మశానాలలోని చెత్తను రోజుకు 490 లారీలలో కక్కిరేణికి తరలించి ఇక్కడ పాతిపెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మూసీకాలుష్యం, ఫ్లోరిన్రక్కసితో బాధపడుతున్న ప్రజలపై మూలిగేనక్కపై తాడిపండుపడ్డ చందంగా వ్యర్థ పదార్థాల శుద్ధి, నిల్వచేసే ఆలోచనరావడం దుర్మార్గమని అన్నారు. జిల్లాకు చెందిన అధికారపార్టీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంపై ఒత్తిడితెచ్చి ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కంపెనీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్ తరాలు క్షమించవని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి చేసే కుట్రలను తిప్పికొటాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా మొండిగా ప్రాజెక్టును కడితే బాంబులతో పేల్చడానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. బతకాలంటే పోరాడాల్సిందే : వామపక్ష పార్టీల నాయకులు కక్కిరేణితోపాటు, నియోజకవర్గంలోని సుమారు యాబై గ్రామాల ప్రజలు బతకాలంటే వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని సీపీఎం, సీపీఐ జిల్లాకమిటీ సభ్యులు మామిడి సర్వయ్య, లొడంగి శ్రవన్కుమార్లు తెలిపారు. పోలీసుల లాఠీలకు, తూటాలకు భయపడేదిలేదని చెప్పారు. సర్పంచ్ దువ్వాసి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, వివిధపార్టీలు, మండలాలకు చెందిన నాయకులు సోమనబోయిన సుధాకర్‌యాదవ్, పిట్ట కుశలవరెడ్డి, పిట్ట జగనోహన్రెడ్డి, నీల దయాకర్, గంగుల వెంకటరాజిరెడ్డి, వేముల సైదులు, వెలిజాల నర్సింహ, బొక్క భూపాల్‌రెడ్డి, ఉండ్ర లింగారెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, చింతపల్లి బయ్యన్న, ఎస్ఆర్ వెంకటేశ్వర్లు, అవిశెట్టి శంకరయ్య, గాలి నర్సింహ, చిరుమర్తి యాదయ్య, పిట్ట రాఘవరెడ్డి, విజయలక్ష్మి, బద్దుల రవి, జిట్ట నాగేష్, వార్డుసభ్యులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం
కక్కిరేణి(రామన్నపేట) కక్కిరేణి గ్రామశివారులో వ్యర్థ రసాయనాల శుద్ధి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటించి తీరుతామని మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన సుమారు 200మంది రైతులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం కక్కిరేణి గ్రామశివారులో తెలంగాణ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో పర్యటించారు. పార్టీ జెండాలను, ప్రాణాలైనా అర్పిస్తాం–ప్రాజెక్టును అడ్డుకుంటామనే నినాదాలతో కూడిన ప్లకార్డులను నాటారు. కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిసర గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే మూసీకలుషిత జలాలతో సతమతమవుతున్న ప్రజలు, వ్యర్థ పదార్థాల శుద్ధిప్లాంట్ ఏర్పాటు ద్వారా ఇంకా ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 5న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహిస్తే జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రాజెక్టు ఏర్పాటును నిలిపివేయాలని, ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 1న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయనవెంట జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, వివిధగ్రామాల సర్పంచ్‌లు కొండూరు శంకర్, బొక్క భూపాల్‌రెడ్డి, మంచిరాజు శరత్చందర్, మందడి రవీందర్‌రెడ్డి, నీల దయాకర్, సాల్వేరు అశోక్, బద్దుల రమేష్, ఉండ్ర లింగారెడ్డి, వడ్డె భూపాల్‌రెడ్డి, పాశం శ్రీనివాస్‌రెడ్డి, కన్నెబోయిన సైదులుయాదవ్, భరత్‌గౌడ్, వేముల సత్తయ్య పాల్గొన్నారు.