
తెలుగు సినిమాల్లో ఆత్మలోపిస్తోంది
వెండితెర నుంచి బుల్లితెరకు బదిలీ అయ్యి, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రదీప్. బుల్లి తెర నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 15కు పైగా నంది అవార్డులు అందు కున్నారు. జంధ్యాల స్కూల్ నుంచి వచ్చిన ఆయన నగరంలో జంధ్యాల జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి : జంధ్యాల స్కూల్ నుంచి వచ్చిన మీకు ఇప్పటి సినిమాలు చూస్తుంటే ఏమనిస్తోంది.
ప్రదీప్ : సాంకేతికంగా అభివృద్ధి చెందినా తెలుగు సినిమాల్లో ఆత్మ లోపిస్తోంది.
సాక్షి : మీరు సినిమా రంగం నుంచి టీవీ రంగానికి రావటానికి గల కారణం?
ప్రదీప్ : టీవీ మీడియా శక్తిమంతమైనది. చాలా త్వరగా జనంలోకి వెళ్తుందనే..
సాక్షి : టీవీ రంగానికి సంబంధించి మీరు మరిచిపోలేని సంఘటన ఏమైనా ఉందా..
ప్రదీప్ : మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి పనిచేయడం. నా దర్శకత్వంలో ఆయన ‘మట్టిమనిషి’ సీరియల్‌లో నటించారు.
సాక్షి : సినిమా, టీవీ.. ఈ రెండు రంగాల్లో మీకు ఏది అనుకూలంగా ఉంది?
ప్రదీప్ : నిస్సందేహంగా టీవీ రంగమే. సినిమాల్లో కేవలం ఒకరిద్దరి మీదే చిత్రం ఆధారపడి ఉంటుంది. టీవీలో అన్ని పాత్రలూ ప్రజలకు కనిపిస్తాయి.
సాక్షి : సినిమాలకు ఉన్నట్టే టీవీ సీరియల్స్‌లో కూడా సెన్సార్‌షిప్ ఉండాలని మేధావుల భావన. దీనిపై మీ కామెంట్..
ప్రదీప్ : టీవీ, సినిమా రెండు రంగాలకు స్వీయ నియంత్రణ అవసరం. మన కుటుంబం కూడా ఈ సినిమా చూడాలి అనే భావన రావాలి.
సాక్షి : ప్రభుత్వం ఇచ్చే అవార్డులపై విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు?
ప్రదీప్ : నాలుగు గోడల మధ్య నిర్ణయించే అవార్డులు కంటే ప్రజాభిమానం గొప్ప.
సాక్షి : నేటి సినిమాలు, సీరియల్స్‌లో చాలా వరకూ విమర్శలకు గురవుతున్నాయి కదా..
ప్రదీప్ :కావచ్చు. సీనియర్ నటులు చాలామంది కథలు, సంభాషణల పట్ల జాగ్రత్తగానే ఉంటున్నారు.
సాక్షి : విజయవాడతో మీ అనుబంధం
ప్రదీప్ : పుట్టింది పెరిగింది విజయవాడలోనే. నా నటనకు పునాదులు పడిందీ ఇక్కడే.
సాక్షి : జంధ్యాలతో కలిసి పనిచేసిన అనుభవం మీకు ఎలా ఉపయోగపడింది?
ప్రదీప్ : 25కు పైగా సినిమాలకు దర్శకత్వం, 300కు పైగా చిత్రాలకు మాటలు రాసిన అనుభవం ఆయనది. జంధ్యాలతో పనిచేసిన సమయంలో స్క్రీన్‌ప్లేపై పట్టు కలిగింది.
సాక్షి : మీ భవిప్యత్ ప్రణాళికలేమిటి?
ప్రదీప్ : కుటుంబసమేతంగా చూడదిగిన కథ తయారవుతోంది. త్వరలోనే సినిమా తీస్తాను.