ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్మాణం దారుణం
ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్మాణం దారుణం
Published Fri, Nov 4 2016 10:47 PM | Last Updated on Tue, May 29 2018 3:42 PM
భీమవరం అర్బన్ : ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణం చేపట్టడం హేయమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. భీమవరం మండలంలోని తుందుర్రులో ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడి జైలుపాలై ఇటీవల విడుదలైన పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, సముద్రాల వెంకటేశ్వర్లు, కోయ మహేష్, బెల్లపు వెంకట సుబ్రహ్మణ్యంలను శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకుల బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ సుమారు మూడు మండలాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా మొండిగా ఫుడ్‌పార్కు నిర్మాణ చేపట్టడం దారుణమన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఫుడ్‌పార్క్ నిర్మాణం వద్దంటూ పోరాడుతుంటే వారికి నాయకత్వం వహించిన పోరాట కమిటీ నాయకులపై అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించి అమాయకులను జైళ్లకు పంపడంపై రాష్ట్రం మొత్తం నివ్వెరపోయిందన్నారు. దీంతో పోరాట కమిటీ నాయకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు.
ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఆరా
ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు తుందుర్రు ఫ్యాక్టరీ, బాధిత గ్రామాల గురించి ఆరా తీస్తున్నారని, ఇప్పుడు కూడా జైలు నుంచి విడుదలైన వారిని పార్టీ తరఫున బృందం వెళ్లి పరామర్శించి రావాలని చెప్పారన్నారు. దీంతో తాము వచ్చినట్టు చెప్పారు. మీకు ఏ ఇబ్బందైనా తలెత్తితే నరసాపురం, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్తలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్‌లు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.
ఉద్యమంపై వెనుకడుగు వేయం : పోరాట కన్వీనర్ ఆరేటి వాసు
ఉద్యమంపై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు స్పష్టం చేశారు. మా ఉద్యమానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇచ్చి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చారన్నారు. మాపై జగనన్న ఎప్పటికప్పుడు ఆరా తీసి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని మా వెన్నెంటే ఉంటున్న వైఎస్సార్ సీపీ నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, భీమవరం, నరసాపురం, తణుకు నియోజకవర్గాల సమన్వయకర్తలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వంక రవీంద్ర, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.కాశీరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల నరసింహరాజు, నాయకులు కాండ్రేకుల నరసింహరావు, జడ్డు తాతయ్య, జవ్వాది సత్యనారాయణ, కొట్టు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement