
ఆ అందాలు తనివి తీరనివి
కాకినాడ : గోదావరి అందాలు తనను అబ్బురపరుస్తున్నాయని సినీ హీరోయిన్ ప్రణీత అన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా సొంతంగా రూపొందించిన ‘డైనమైట్’ చిత్రంలో ఆమె హీరోయిన్. ఆ చిత్రం ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక జీఎస్‌ఎల్ వైద్య కళాశాలకు వచ్చిన బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గోదావరి తీరం సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువైన ప్రాంతమని, ఈ పరిసరాల్లోని దృశ్యాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని అన్నారు.
‘అత్తారింటికి దారేది, రభస’లతోపాటు ఇంతవరకు తెలుగులో ఆరు సినిమాలు చేశానన్నారు. ‘డైనమైట్’ వంటి యాక్షన్ థ్రిల్లర్‌లో మొదటిసారిగా నటించానన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో కొన్ని సందర్భాలలో గాయాలైనా ప్రివ్యూ చూశాక ఆ వాటన్నింటినీ మరిచిపోయానని చెప్పారు. ప్రస్తుతం పేరు పెట్టని మరో చిత్రం షూటింగ్‌లో ఉందన్నారు. ‘బాహుబలి’ వంటి సినిమాల్లో నటించాలని ఉందని, ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధమేనని చెప్పారు.