'ఆ ఘటనకు చంద్రబాబుదే బాధ్యత'
పశ్చిమగోదావరి(నరసాపురం): గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలో చోటుచేసుకున్న దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైఎన్ కళాశాలలో శనివారం నిర్వహించిన పుష్కర హిందూ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. పవిత్ర పుష్కరాల తొలి రోజే 27 మంది మరణించడం బాధకరమని అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఈసందర్భంగా బాబు సర్కారుపై తొగాడియా మండిపడ్డారు.
జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుతం హిందువులు మైనార్టీలుగా ఉన్నారని, రాబోయే వందేళ్లలో భారతదేశంలో హిందువులే మైనార్టీలుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అందుకే హిందుత్వాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తొగాడియా పేర్కొన్నారు. హిందువుల పురోభివృద్ధికి, విద్య, ఉద్యోగం, ఆర్థిక పరిపుష్టి కోసం వీహెచ్‌పీ కృషి చేస్తుందన్నారు.