గంగమ్మకు జేజేలు
వేములవాడ : నాలుగేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఎములాడ జనాలకు ఆదివారం ఉదయం తీపి కబురు వరదలా వచ్చి చేరింది. పట్టణ శివారులోని మూలవాగు పొంగి ప్రవహిస్తోందనే సమచారంతో ప్రజలు వేకువజాము నుంచే వాగుబాట పట్టారు. నిన్నటి వరకు ఎడారిని తలపించిన మూలవాగు జలకళ సంతరించుకోవడాన్ని చూసి పుణీతులయ్యారు. ఎగువన నిమ్మపల్లి ప్రాజెక్టు నిండి మత్తడి దూకుతుండటంతో ఆ నీరంతా మూలవాగులోకి చేరుతోంది. ఆ ప్రవాహం వేకువజామున నాలుగు గంటలకు వేములవాడకు చేరిందని రజకులు చెప్పారు. నగరపంచాయతీ చైర్‌పర్సన్ నామాల ఉమ, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ తెప్పవద్ద గంగమ్మతల్లికి మహాహారతి ఇచ్చారు. స్థానిక గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పంపరి దేవయ్య, సొసైటీ అధ్యక్షుడు కూర దేవయ్య ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు గంగమ్మ తల్లికి తెప్ప సమర్పించేందుకు ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం మూలవాగు నీటి ప్రవాహంలో అమ్మవారి ఒడిలోకి తెప్పను వదిలారు.
గుడి చెరువుకి జలకళ
మూలవాగు పొంగి ప్రవహించడంతోపాటు మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న గుడి చెరువులోకి భారీగా నీరువచ్చి చేరుతోంది. రూ. 62.89 కోట్ల వ్యయంతో మిషన్ కాకతీయ పనులు కొనసాగుతోంది. దీంతో వరద నీటిని మల్లారం ఫీడర్ చానల్ వద్ద నియంత్రించడంతో స్వల్ప ప్రవాహమే వస్తోంది.
వరదకాలుకు నీటివిడుదల
మేడిపెల్లి: భారీ వర్షాలతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నిండగా వరదకాలువకు నీటిని విడుదల చేశారు. దీని ద్వారా ఎల్‌ఎండీకి భారీ ఎత్తున నీరు తలిపోతోంది. కాలువ ఆయకట్టు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలలో గల బావులు, చెరువులు, కుంటలు, బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని దమ్మన్నపేట, కల్వకోట, కొండాపూర్, కాచారం రంగాపూర్, విలాయతబాద్ గ్రామాలు రైతులు చెబుతున్నారు.
రాళ్లవాగు ప్రాజెక్టు వద్ద సందర్శకుల సందడి
కథలాపూర్ : కరీంనగర్– నిజామాబాద్ జిల్లాల సరిహద్దులోని కథలాపూర్ శివారు రాళ్లవాగు ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. మత్తడి పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహించడం కనువిందు చేసింది. కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్, చందుర్తి మండలాలకు చెందిన ప్రజలు ప్రాజెక్టును సందర్శించారు. మత్తడి పైనుంచి పారుతున్న నీటి ఉధృతి వద్ద యువతీయువకులు, విద్యార్థులు కేరింతలతో సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విందు.. వినోదాలతో ఎంజాయ్ చేశారు.
వర్షాలతో ప్రజల ఇబ్బందులు
కోనరావుపేట : ఒకేరోజు కురిసిన భారీ వర్షానికి వివిధ గ్రామాలు అతలాకుతలమయ్యాయి. కోనరావుపేట–ఎగ్లాస్‌పూర్, కోనరావుపేట–నిమ్మపల్లి, వెంకట్రావుపేట–కొండాపూర్, వట్టిమల్ల–నిమ్మపల్లి మధ్య ఒర్రెలు పొంగి పొర్లడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఎగ్లాస్‌పూర్‌లో తారురోడ్డు తెగిపోయి, ట్రాన్స్‌ఫార్మన్ నేలకూలింది. విద్యుత్ సరఫరా, రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.