ఒత్తిడిలో ముత్తిరెడ్డి!
-
జనగామలో ఆగని జిల్లా సాధన పోరు
-
ఎమ్మెల్యేకు ప్రతికూలంగా పరిణామాలు
-
జిల్లా విషయంలో ఎంపీతో విభేదాలు
-
జేఏసీ నిరసనలతో ఉక్కిరిబిక్కిరి
-
నియోజకవర్గం చీలికతో మరింత ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా సాధన ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) కొనసాగిస్తున్న ఉద్యమ కార్యక్రమాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రాజకీయంగా ప్రతికూలంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాలతో ఈ ప్రాంతంలో తమకు ఇబ్బందులు పెరుగుతున్నాయని టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఇదే విషయంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమైన సంఘటనను గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతరం పెరిగి పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే... జనగామ జిల్లా ఏర్పాటు ఖాయమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమైంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం ఇదే విషయాన్ని పలుసార్లు, పలు వేదికలపై ప్రకటించారు. జనగామ జిల్లా సాధన కోసం స్థానికంగా ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) ఏర్పాటైంది. జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 116 రోజుల పాటు దీక్షలను చేస్తూ వచ్చింది. జనగామ జిల్లా ఏర్పాటవుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దీక్ష శిబిరం వద్ద ప్రకటించారు. జేఏసీ దీక్ష విరమించాలని కోరారు.
ఆ తర్వాత జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకోవడంతో పరిస్థితి మారిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనల్లో జనగామను చేర్చలేదు. దీంతో జిల్లా సాధన కోసం ఉద్యమాలు తీవ్రమయ్యాయి. నిరసనలు, మానవహారాలు, రాస్తారోకోలు, బంద్‌లు జరుగుతూ వచ్చాయి. జేఏసీకి తోడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే గొంతు వినిపించడం మొదలుపెట్టాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి తీవ్రమైంది. లాఠీచార్జీలు, అరెస్టులతో జనగామ దద్దరిల్లిపోయింది.
ఈ సంఘటన తర్వాత ఉద్యమం కొంత స్తబ్ధుగా ఉంది. అప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిరెడ్డి పలు మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన జేఏసీ నేతలు మళ్లీ ఉద్యమం మొదలుపెట్టారు. ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి అధికారిక కార్యక్రమాలు మళ్లీ తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కారక్రమాన్ని గత వారం జనగామలో భారీ స్థాయిలో నిర్వహించినా ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. గతంలో ప్రతిరోజూ నియోజకవర్గంలో పర్యటించే ఎమ్మెల్యే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడంలేదని జనగామ సెగ్మెంట్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నియోజకవర్గం ముక్కలు...
జిల్లాల పునర్విభజన అంశం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రెండు రకాలుగా ఇబ్బందులు పెంచుతోంది. జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటు అంశంపై ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతుండడంతో స్థానికంగా ఎమ్మెల్యేపై ప్రతికూలత మొదలైందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జిల్లాల పునర్విభజనలో జనగామ నియోజకవర్గం మూడు ముక్కలు అవుతోంది. జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం... ఈ ఐదు మండలాలు మూడు జిల్లాల్లో ఉండనున్నాయి. జనగామ, బచ్చన్నపేట మండలాలు యాదాద్రి జిల్లాలో... చేర్యాల, బచ్చన్నపేట మండలాలు సిద్ధిపేట జిల్లాలో... నర్మెట మండలం వరంగల్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం ప్రతిపాదనల్లో పేర్కొన్నది. అసెంబ్లీ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో ఉంటే... ఎమ్మెల్యేకు రాజకీయపరంగా పట్టు తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. వేర్వేరు జిల్లాల్లో ఉండే ద్వితీయ శ్రేణి నేతలను ఇప్పటిలా సమన్వయం చేయడం ఆయనకు ఇబ్బందిగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.