విద్యార్థుల పోరుబాట
-
మంథనిలో జేఎన్‌టీయూలో అసౌకర్యాలు
-
అధ్వానంగా అంతర్గత రోడ్లు
-
ఫ్యాకల్టీ కొరత
-
జనరేటర్ సౌకర్యంలేదు
-
వైద్యసౌకర్యం కరువు
సెంటినరికాలనీ : సెంటినరికాలనీలోని మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు కళాశాల బ్లాక్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంలేదని, పర్మినెంట్ ఫ్యాకల్టీ లేరని, రెండురోజులుగా హాస్టల్ భవనంలో విద్యుత్‌కోత విధిస్తున్నారని ఆగ్రహంవ్యక్తంచేశారు. యూనివర్సిటీ కళాశాలకు ఉండాల్సిన అర్హతల్లో ఒక్కటి కూడా లేదని, అంతర్గతరోడ్లు అధ్వానంగా మారాయని తెలిపారు. వర్షం పడితే హాస్టల్‌నుంచి కళాశాలకు రావాలంటే బురదలో నడవలేకపోతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. రాత్రిపూట విద్యుత్ కోతతో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని, చుట్టుపక్కల నుంచి పాములు హాస్టల్‌లోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. ల్యాబ్‌లో సరైన పరికరాలు లేవని, లైబ్రరీలో సైతం పుస్తకాలు సరిగ్గాలేవని చెప్పారు. బయటి కళాశాలల్లో వసతులు లేవని పర్మిషన్లు రద్దుచేసే ప్రభుత్వం జేఎన్‌టీయూ సమస్యలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
డెప్యూటీ సీఎం వచ్చినా..
కళాశాల ప్రారంభమైన నాటినుంచి ఫ్యాకల్టీ కోసం విద్యార్థులు అనేకమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏప్రిల్ 30న కళాశాలలో హాస్టల్ భవనాలను ప్రారంభించడానికి డెప్యూటి సీఎం, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరిరాగా.. విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను వెంటనే పరిష్కరించి నివేదిక అందజేయాలని ప్రిన్సిపాల్ మార్కండేయులును ఆదేశించారు. మూడు నెలలు గడుస్తున్నా ఏఒక్క సమస్యను పరిష్కరించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సౌకర్యాలకల్పనలో అధికారులు మెతక వైఖరి అవలంబిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వేరే కళాశాలల్లో సౌకర్యాలు లేవని మూసివేస్తున్న ప్రభుత్వం జేఎన్టీయూని మాత్రం పట్టించుకోవడంలేదు.
–స్వాతి, సివిల్ థర్డ్‌యర్
డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలి
కళాశాలలో ఆస్పత్రితోపాటు అంబులెన్స్‌ను ఏర్పాటుచేయాలి. రాత్రి సమయాల్లో విద్యార్థులకు ఏ అవసరం వచ్చిన దగ్గరలో ఆస్పత్రి లేకపోవడంతో స్థానిక ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లాల్సివస్తోంది. కనీసం అంబులెన్స్ అందుబాటులో ఉండుటలేదు.
–నిధ, ఈఈఈ విద్యార్థిని
జనరేటర్ ఏర్పాటుచేయాలి
రెండురోజులుగా హాస్టల్‌లో కరెంట్‌కోతతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. బయటికి వెళ్లాలంటే పాముల భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సెల్‌లైట్ వేసుకుని వెళ్లాల్సి వస్తుంది.
–మధుమిత, సివిల్ సెకండియర్
సమస్య తీరలేదు..
డెప్యూటీ సీఎం రాకతోనైనా మాకు న్యాయం జరుగుతుందనుకున్నాం. మూడునెలలు గడుస్తున్నా ఏసమస్య తీరలేదు. మాగోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడంలేదు. కొత్త వీసీలైనా మా సమస్యలకు పరిష్కారంచూపాలి.
– శశిప్రీతం, విద్యార్థి