జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ రమణరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లకుండా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. యూనివర్సిటీ అనుమతి లేకుండా విహారయాత్రలకు తీసుకెళ్తే కాలేజీ గుర్తింపును రద్దు చేసేలా నిబంధనలను రూపొందిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కాలేజీలు పారిశ్రామిక శిక్షణ కోసం పంపాలే తప్ప విహార యాత్రలకు కాదన్నారు. ఒకవేళ విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే.. యూనివర్సిటీ అనుమతి తీసుకోవాలని చెప్పారు. అవసరమైన జాగ్రత్తలతో పాటు విద్యార్థుల రక్షణకు భరోసా ఇచ్చినపుడే యూనివర్సిటీ ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీనిపై కమిటీ వేసి తగిన మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు.
హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
నగరానికి చెందిన వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన ఘటనపై బాలల హక్కుల సంఘం హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసింది. సోమవారం సంఘం కార్యదర్శి అనురాధ ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌సీ సభ్యులు పెద పేరిరెడ్డిని కలసి విన్నవించారు. విద్యార్థుల యాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.