
'నాకేం.. మా రాజశేఖరరెడ్డి ఉన్నాడన్నాడు'
కాకినాడ : ప్రజలు సంతోషంగా ఉండాలంటే ముందు ప్రభుత్వం మైండ్ సెట్ మారాలి. ప్రజలపై పన్నులు వేసి పీడించకుండా వారి అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ప్రొఫెసర్ తిమ్మారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...' నాకు కాకినాడ కొత్తకాదు. సుమారు 15 సంవత్సరాలు వరకూ దాదాపు ప్రతినెల కాకినాడ వచ్చేవాడిని. పలు విద్యా సంస్థల అభివృద్ధిలో పాలుపంచుకునేవాడిని. యువభేరి కార్యక్రమంలో పాల్గొనాలని అడిగిన వెంటనే ఒప్పుకున్నా. ఈ జయం...విజయం నాది కాదు... జగన్ మోహన్ రెడ్డి గారిది. రెండు నిమిషాలు మాట్లాడతా సావధానంగా. వినాలి...ఆలోచించాలి.... ప్రశ్నించాలి. ఇక్కడొక విషయం చెప్పాలి.
నేను కర్నూలు జిల్లా వాసిని. అయితే ఓ వ్యవసాయ కార్యక్రమం నిమిత్తం ఓ గ్రామంలో మూడు నెలలు ఉండాల్సి వచ్చింది. అక్కడ ఓ పాలేరు కొడుకు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మరో కొడుకుని ఇంజినీరింగ్లో చేర్పించేందుకు సిద్ధం అయ్యాడు. ఇదే విషయాన్ని నేను అతడిని అడిగా. కూలీ పని చేస్తున్నావు ఇప్పటికే ఓ కొడుకును చదివిస్తున్నావు. ఇంకో కొడుకును ఎలా చదవిస్తావయ్యా అని అడిగితే... 'నాకేమీ రెడ్డి ..మా రాజశేఖరరెడ్డి ఉన్నాడు' అని ధీమాగా చెప్పాడు. ఇది వింటేనే అర్థం అవుతుంది వైఎస్ పాలనలో అన్ని వర్గాలకు ఆ భరోసా ఉంది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత అందరిలోనూ అలజడి ఏర్పడింది' అని ఉదహరించారు.