
ములుగు అటవీ పరిశోధనా కేంద్రంలో టేకు మొక్కలు
- వృక్షాల్లో అత్యంత విలువైనది
- సాగుపై అవగాహన అవసరం
- గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు
- నీలాంబర్ టేకు: దీనినే మలబారు టేకు అని కూడా అంటారు. కేరళాలోని సముద్ర తీరప్రాంతంలో ఇది ఉత్పత్తి అవుతుంది.
- అదిలాబాద్ టేకు: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 7వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వాసం, జామాయిల్‌తో పాటు పద్ధతి ప్రకారం పెంచుతున్నారు.
- సీపీటీ టేకు: ఈ రకం మధ్యప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతుంది.
- దెండ్లీ టేకు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాల్లో పెంచబడే రకం. దీన్ని నార్త్ కర్ణాటక టేకు అని కూడా అంటారు.
- గోదావరి టేకు: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే రకం.
- మైసూర్ టేకు: మైసూర్ జిల్లాలో ఉత్పత్తి అయ్యే టేకు రకం
గజ్వేల్: కలపకు అనువైన వృక్షాల్లో ‘టేకు’ కీలకమైంది. అత్యంత విలువైందిగా ఈ వృక్షానికి పేరుంది. తమకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో రైతులు టేకు సాగు చేసుకుని ఏటా మంచి ఆదాయం పొందవచ్చని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్ నెం : 7288894469) సూచిస్తున్నారు. సాగు విధానాలపై ఆయన అందించిన సలహాలు, సూచనలివి...
టెక్టోనా గ్రాండీస్
ఈ రకం వృక్షాలు సాధారణంగా నవంబర్ నుంచి మే వరకు ఆకులు రాల్చి, ఏప్రిల్ నుంచి జూన్‌లో కొత్త ఆకులు తొడుగుతాయి. ఆకులు పెద్దవిగా, దళసరిగా గుమ్మడి ఆకులవలే గరుకుదనం కలిగిఉంటాయి. జూలై-ఆగస్టులో పూతకు వచ్చి, నవంబర్-జనవరి మధ్యన విత్తనాలు తయారవుతాయి.
సిల్వర్ కల్చర్
ఈ రకం టేకు చెట్టుకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం. అనావృష్టి, ఎక్కువ చలిని తట్టుకునే శక్తిని ఈ చెట్టుకు ఉండదు. ఒక మాదిరిగా గాలి వేగాన్ని తట్టుకుంటుంది. ఈ మొక్కలను పశువులు మేయవు. కానీ విరిగినట్లయితే పక్కనుండి పిలకలు పెట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటిలో బలమైన ఓ పిలక ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి.
దేశవాళీ రకాలు
దిగుమతి చేసుకునే అవకాశమున్న మరికొన్ని రకాలు
మయన్మార్, బర్మాటేకు, ఘనా టేకు, కొలంబియా టేకు(దక్షిణ అమెరికా), జావా టేకు(ఇండోనేషియా, థాయ్‌లాండ్), మలేషియా టేకు.
పునరుత్పత్తి
విత్తనాల నుంచి సహజ పునరుత్పత్తి చేయవచ్చు. స్టంప్ లేదా టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు.
విత్తనాల సేకరణ
పక్వానికి వచ్చిన పండ్ల నుంచి విత్తనాలను సేకరించాలి. భూమిపై రాలిన విత్తనాలను పోగు చేసి శుభ్రం చేయాలి.
విత్తన శుద్ధి
విత్తనాలను వేడినీటిలో 2-4గంటల వరకు ఉంచి, ఆపై విత్తనాలు చల్లబడ్డాక విత్తుకోవాలి. లేదా విత్తనాలను ప్రతి రోజు రాత్రి నానబెట్టి పగలు ఎండబెట్టాలి. ఇలా 15-20రోజులు చేసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలను గోనే సంచిలో వేసి గుంతలో పూడ్చి 10 రోజుల వరకు ప్రతిరోజు నీరు పోసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి.
లేదా విత్తనాలను పేడ నీళ్ల పేస్టులో 15రోజులుంచి ఆ తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనాలను 2-3 వారాల వరకు పగలు ఎండలోనూ, రాత్రి నీటిలో ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి. ఇదీ కాకపోతే విత్తనాలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడిగి విత్తుకోవాలి.
నారు మడుల తయారీ, నాటే విధానం
శుద్ధి చేసిన విత్తనాలను 6మీటర్ల పొడవు, 1మీటరు వెడల్పుగల నారు మడుల్లో ఫిబ్రవరి-మే మధ్య కాలంలో విత్తుకోవాలి. అలా మొలిచిన మొక్కలను ఒక ఏడాదిపాటు పెరగనీయాలి. మొక్కలను పీకి స్టంప్‌లను తయారు చేయాలి. వేరు భాగాల్లోని పక్క వేర్లను పదునైన కత్తితో తీసివేయాలి. స్టంప్‌లను జూలై నెలలో 3/1.3 మీటరు దూరంలో వాలుకు అడ్డంగా నాటాలి. లేదా స్టంప్‌లను పాలథిన్ సంచులలో 6 నెలలు పెంచి నాటవచ్చు. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాలి.
ఎరువులు
ప్రతి పాదులో స్టంప్ నాటిన రెండు నెలల తర్వాత 4కిలోల పశువుల ఎరువు వేయాలి. అలాగే సంచులలో పెంచిన మొక్కలు నాటే గుంతల్లో 4కిలోల పశువుల ఎరువుతో పాటు 50 గ్రాముల్లో 3శాతం లిండేన్ పొడిని వేసి నాటుకోవాలి. మొదటి ఏడాది డీఏపీ ఒక్కో మొక్కకు 150గ్రాములు రెండు దఫాలుగా జూలై నుంచి డిసెంబర్ నెలల మధ్యలో ఇవ్వాలి. రెండో ఏడాది డీఏపీ 300గ్రాములు రెండు దఫాలుగా జూలై నుంచి డిసెంబర్ మధ్యలో వేయాలి. మూడో ఏడాది డీఏపీ 400 గ్రాములు ఒక దఫా జూలై నెలలో వేయాలి.
నీటి యాజమాన్యం
మొక్కలు నాటగానే 4రోజులు... రోజు విడిచి రోజు నీరు పోయాలి. ఆపైన వర్షాలు లేనప్పుడు 15-20రోజులకోసారి నీరు ఇవ్వాలి. వేసవి కాలంలో 10-15 రోజులకోసారి నీరు ఇవ్వాలి. అలా కనీసం 2-3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలోనూ నీరు పెట్టుకోవడం శ్రేయస్కరమే.