అమాయక మహిళలకు డబ్బులు ఆశ చూపి పడుపు వృత్తిలోకి దింపుతున్న లాడ్జిల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.
సాక్షి, తిరుపతి క్రైం: అమాయక మహిళలకు డబ్బులు ఆశ చూపి పడుపు వృత్తిలోకి దింపుతున్న లాడ్జిల యజమానులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సాయి అమృత లాడ్జి, సాయి విజయ, అశోక రెసిడెన్సీ, హరిచరణ్ లాడ్జిల వారు ఓ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులకు డబ్బు ఆశ చూపి తీసుకొచ్చి పడుపు వృత్తిలోకి దించేవారు.
దీనిపై సమాచారం రావడంతో దాడులు జరపగా సాయి అమృత లాడ్జి యజమాని శ్రీనివాసులు సహా 8 మంది పట్టుబడగా మరో ముగ్గురు లాడ్జి యజమానులు పరారైనట్లు ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మునిరామయ్య తెలిపారు. పట్టుబడిన వారంతా మధ్యవర్తులు, ఆటో డ్రైవర్లతో సంబంధాలు ఏర్పరుచుకుని రైళ్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి వచ్చే భక్తులను, స్థానికులను టార్గెట్ చేసుకుని వారికి మహిళలను ఆశ చూపించి సొమ్ము చేసుకునేవారన్నారు. పట్టుబడిన యువతులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపామన్నారు.