అలీసాగర్ నీటి కోసం ధర్నా
ఎడపల్లి:
అలీసాగర్ నీటితో ఎడపల్లి మండలంలోని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ విపక్షాల నేతృత్వంలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. శాటాపూర్ గేట్ వద్ద బోధన్–నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించారు. డి–46 కాలువ ద్వారా అలీసాగర్ నీటిని ఎడపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. అలీసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. నీటి విడుదలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గఫర్‌మియా, ఇరిగేషన్ ఈఈ సత్యశీల్‌రెడ్డి హామీ ఇచ్చినా నేతలు, రైతులు శాంతించలేదు. ఆర్డీవో వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో సమాచారమందుకున్న ఆర్డీవో సుధాకర్‌రెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో మట్లాడారు. అలీసాగర్ నీటిని తమ మండలానికి ఇవ్వకుండా, డి–50 కాలువకు విడుదల చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమకు నీళ్లివ్వాలని ఓ రైతు ఆర్డీవో కాళ్లు పట్టుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి చెరువులు నింపుతామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు బిల్ల రామ్మోహన్, ఎల్లయ్యయాదవ్, నర్సింగ్, అంజాగౌడ్, ఇస్మాయిల్, సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు సురేశ్, పోశెట్టి, భాస్కర్‌రెడ్డి, హన్మాండ్లు, శ్రీధర్, ఆంజనేయులు పాల్గొన్నారు.