గట్టుప్పల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
గట్టుప్పల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
Published Sat, Oct 15 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
గట్టుప్పల(చండూరు)
గట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. గట్టుప్పల గ్రామస్తులతో పాటు మర్రిగూడ మండలం నామాపురం, మేటిచందాపురం, చండూరు మండలం తేరట్‌పల్లి గ్రామస్తులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. శుక్రవారం పోలీసులు గట్టుప్పలలో దీక్షలకు భగ్నం కలిగించి శనివారం నాయకులను గృహనిర్భంధం చేశారు. యధావిధిగా నిర్బంధంలోనే కొనసాగుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. మూడు రోజుల క్రితం మండలం కోసం ఏర్పుల యాదయ్య ఆత్మహత్య చేసుకోగా, శుక్రవారం బొడిగే సోని మృతి చెందడంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా పోలీసులు భారీగా మొహరించారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ముందస్తుగా 15 మంది యువకులను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన నాయకులు మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం, వైస్ ఎంపీపీ అవ్వారు శ్రీనివాస్ , ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కంచుకుంట్ల సుభాష్ , సర్పంచ్ నామని జగన్నాథంలను గృహనిర్బంధం చేశారు. మరికొంత మంది గ్రామస్తులను పోలీసులు అదే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ రోడ్లపై ఎవ్వరిని ఉండనీయడం లేదు. ఎస్పీ ప్రకాష్ రెడ్డి రెండు రోజులుగా గ్రామాన్ని సందర్శిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐల తో పాటుగా 400 మంది పై చిలుకు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాన్ని మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరో రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించడం సబబుకాదు : గంగిడి
గట్టుప్పల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న సోనిది ఆత్మహత్య కాదని, హత్యేనని పోలీసులు నిర్ధారించడం ఎంత వరకు సబబని బీజేపీ రాష్ట కోశాధికారి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం గట్టుప్పల గ్రామాన్ని సందర్శించారు. ఈసందర్భంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచారు. అనంతరం స్థానిక చౌరస్తా లో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Advertisement
Advertisement