మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి
ఉత్తమ విద్య అందించడమే లక్ష్యం
Published Sat, Aug 6 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
–రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల : రాష్ట్రంలో ఉత్తమ విద్యను అందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం బాదేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి విద్యా సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తుందని, కేజీ నుంచి పీజీ వరకు అమలు చేసే ఉచిత విద్య విధానంపై చర్చిస్తుందన్నారు. నేటి పరిస్థితులకు అనుగునంగా, ఉపాధి కల్పించే విధంగా వృత్తి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొన్ని విద్యాసంస్థలు దుర్వినియోగం చేసి అవకతవకలకు పాల్పడ్డాయని గుర్తు చేశారు. అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అదనపు గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు,తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా 50 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామన్నారు. కంప్యూటర్ వలంటీర్లను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. వైద్య శాఖ ఆద్వర్యంలో ఆర్‌బీఎస్‌కే కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కళాశాల, జెడ్పీహెచ్‌ఎస్ స్థాయిలో బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందజేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
అభివృద్ధికి రూ. 2కోట్లు కేటాయింపు
జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇటీవల జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తాము సమీక్షించిన సందర్భంగా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే రూ.కోటి కేటాయిస్తే ఇందుకు ప్రభుత్వం రూ. 3కోట్లు కేటాయించడంతో పాటు మరో కోటి నిధులను కంట్రిబ్యూషన్ కింద జమచేస్తుందని తెలిపారు. మొత్తం రూ. 5కోట్లతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తుందన్నారు. అందులో భాగంగా తాము రూ. 2కోట్లు కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్‌వీఎం పీఓ గోవిందరాజులు, డిప్యూటీ ఈఓ పాపయ్య, జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఆర్‌వీఎం డీఈఈ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement