రోదిస్తున్న అమ్మన్నమ్మ కుటుంబ సభ్యులు
విజయవాడ బెంజి సర్కిల్‌లో రోడ్డు ప్రమాదం
ఇద్దరి మృతి–ముగ్గురి పరిస్థితి విషమం
మరో ముగ్గురికి గాయాలు
పుష్కరాల నుంచి తిరిగొస్తుండగా విషాదం
కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరిగొస్తుండగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా, ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను మండలానికి పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా గాయాల పాలైన వారికి హెల్ప్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. ఈ ఘటనతో ఆయా కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...
పొందూరు : మండలంలోని తోలాపి, కింతలి గ్రామాలకుS చెందిన పైడి వెంకటరమణ(45), సనపల హర్షవర్ధన్(10)లు విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పైడి అమ్మన్మమ్మ కుటుంబానికి చెందిన వారంతా తమ సొంత కారులో విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లారు. మంగళవారం తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. కింతలి గ్రామానికి చెందిన పైడి అమ్మన్మమ్మ పెద్ద కొడుకు పైడి వెంకటరమణ(45), చిన్న కొడుకు పైడి అప్పలస్వామి, చిన్న కోడలు పైడి శారదాదేవి, మనవళ్లు మహేష్ వర్మ, జ్ఞాన సూర్య, తోలాపి గ్రామానికి చెందిన సనపల భూలక్ష్మి(అమ్మన్నమ్మ కూతరు), మనవడు సనపల హర్షవర్ధన్(10) ఒకే కారులో పెళ్లి, పుష్కరాల కోసం ఆదివారం బయలుదేరి వెళ్లారు. అన్నవరంలో ఓ పెళ్లికి వెళ్లి సోమవారం ఉదయమే విజయవాడ పుష్కరాలకు బయలుదేరారు. పుష్కర స్నానం చేసిన వెంటనే మంగళవారం ఏలూరులోని కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లేందుకు ప్రణాళిక వేసుకొని, భోజనం చేసేందుకు వస్తున్నామని ఉదయం 11.30 గంటలకు ఫోన్‌లో బంధువులకు సమాచారం ఇచ్చారు. కాగా 12.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రమాదంలో గాయాల పాలైన సనపల భూలక్ష్మి భర్త సనపల మురళీధర్‌కు ఫోన్‌లో చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు మృతి చెందారు.
విషాదం...
ఈ ఘటనతో తోలాపి, కింతలి గ్రామాల్లోని శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలో విషాదం అలముకొంది. తోలాపిలో పైడి అమ్మన్నమ్మ, వెంకటరమణ, అప్పలస్వామి, శారదాదేవి, మహేష్ వర్మ, జ్ఞాన సూర్యలు నివాసముంటున్నారు. మృతుడు వెంకటరమణ సివిల్ ఇంజినీరింగ్ చదవడంతో ప్రైవేటు కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. వారిలో వెంకటరమణ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తోలాపిలో నివాసముంటున్న సనపల మురళీధర్, సనపల భూలక్ష్మి, హర్షవర్దన్‌లు ఇటీవలనే శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీకి వెళ్లారు. మృతుడు హర్షవర్ధన్(10) సాయి విద్యామందిర్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.