అదిగో పుష్కరం.. ఎప్పటికి పరిష్కారం?
అదిగో పుష్కరం.. ఎప్పటికి పరిష్కారం?
Published Thu, Aug 4 2016 7:21 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
వారంలో పుష్కరాలు ప్రారంభం కానుండగా కీలకమైన ఘాట్ల నిర్మాణ పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఏ+ కేటగిరీలో మొదటి వరుసలో ఉన్న దుర్గాఘాట్‌లో ఇంకా టైల్స్ కూడా వేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పున్నమి ఘాట్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉండగా, సీతానగరం ఘాట్లలో కొన్నింటినీ మాత్రమే పూర్తిచేసి మమ.. అనిపించారు. ప్రస్తుతం వీటి పనులు చూస్తే పుష్కరాల నాటికి అందుబాటులోకి వచ్చేది సందేహమే..
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్‌లో పనులు ఇంకా కొలిక్కి రాలేదు. పుష్కర స్నానానికి భక్తులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ ఘాట్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల తీరుపై కలెక్టర్ బాబు.ఏ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మార్పు రాలేదు. మే 15వ తేదీన దుర్గాఘాట్‌లో పనులు ప్రారంభించగా, రెండు నెలలో పూర్తికావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంతవరకు నదిలో ఘాట్ నిర్మాణం మాత్రమే పూర్తికాగా, కొంతమేర మెట్లు నిర్మించారు. మెట్లకు టైల్స్ పనులే ఇంకా ప్రారంభం కాలేదు. వారం రోజులే గడువుండగా, పనులు ముందుకు సాగకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీఐపీ ఘాట్ కానందుకేనా..?
దుర్గాఘాట్‌కు ఆనుకుని గతంలో వీఐపీ ఘాట్ ఉండేది. పుష్కర పనుల్లో భాగంగా వీఐపీ ఘాట్‌ను ఆధునికీకరించి దుర్గాఘాట్‌లో కలిపేశారు. దీంతో సీఎంతో పాటు ఇతర మంత్రులు దుర్గాఘాట్‌లోనే పుష్కర స్నానం చేస్తారని అందరూ భావించారు. అయితే, వీఐపీ ఘాట్‌ను సంగమం వద్దకు మార్చడంతో దుర్గాఘాట్‌లో పనులు నత్తనడకన జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం దుర్గాఘాట్‌లోని పాత మెట్లకు ఎగువన, దిగువన కొత్తగా మెట్లు నిర్మిస్తున్నారు. రావిచెట్టు వద్ద పనులు తొలి దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవిత్ర సంగమం వద్ద వీఐపీలు పుష్కర స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పుష్కర పనుల ప్రారంభం సమయంలో దుర్గాఘాట్‌లోనే వీఐపీలు స్నానాలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. అయితే, ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం, ఆ పక్కనే నమూనా దేవాలయాలు ఉండటంతో వీఐపీలు ఇక్కడే స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దుర్గాఘాట్‌కు దిగువన ఉన్న పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లలో పనులు దాదాపు ముగింపు దశకు చేరాయి. కృష్ణవేణి ఘాట్ అటు బస్టాండ్‌కు , ఇటు రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ఉండటంతో భక్తులు ఎక్కువగా అక్కడికే వచ్చే అవకాశాలున్నాయని భావించిన జిల్లా కలెక్టర్ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
కలెక్టర్ పర్యవేక్షణ
దుర్గాఘాట్‌లో పనులను ఈనెల మొదటికి పూర్తి చేయాలని కలెక్టర్ బాబు.ఏ అధికారులను ఆదేశించారు. అయితే, దాదాపు 50 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడంతో మరో 5 రోజులు గడువు పొడిగించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ బాబు.ఏ దుర్గాఘాట్‌లో పనులు పరిశీలించేందుకు విచ్చేసిన క్రమంలో ఘాట్‌లో ఒక్కరు కూడా పనిచేసే వారు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పనులు వేగవంతం చేసేందుకు సిద్ధమైనా ఉదయం నుంచి కురిసిన వర్షంతో నత్తనడకన కొనసాగాయి. మధ్యాహ్నం నుంచి కాసింత తెరిపి ఇవ్వడంతో పనులు ప్రారంభించారు. అయితే, వారం రోజుల్లో దుర్గాఘాట్‌లో ఏ మేరకు పనులు పూర్తవుతాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement