చంద్రబాబు ప్రచార పిచ్చితో ప్రజలకు నష్టం
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
వేదాద్రి (పెనుగంచిప్రోలు) :
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చి ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాలు తొమ్మిదో రోజు శనివారం వేదాద్రి పుష్కర ఘాట్‌లో ఆయన స్నాన మాచరించి పిండ ప్రదానాలు చేశారు. శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పుష్కర నిధులు చాలా వరకు దుర్వినియోగమయ్యాయన్నారు. రూ.80 కోట్ల పనులు నామినేషన్‌పై ఇచ్చారన్నారు. హై సెక్యూరిటీ పేరుతో భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. పుష్కరాల్లో అందరికీ దానాలు చేయడం సంప్రదాయమని, అలాంటిది ఎక్కడా బిచ్చగాళ్లు ఉండకూడదని ముఖ్యమంత్రి వారిని విజయవాడలో లేకుండా పంపించడం దారుణమన్నారు. ఆయన వెంట జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఉన్నారు.