శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్స్ ఫుల్
శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్స్ ఫుల్
Published Sun, Aug 21 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
ఇంద్రకీలాద్రి :
శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులన్నీ ఆదివారం కిటకిటలాడాయి. రికార్డు స్థాయిలో యాత్రికులు విజయవాడకు చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. నగర శివారులో ఆర్టీసీ ఏర్పాటు చేసిన శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులలో యాత్రికులు స్నాన ఘాట్లకు చేరుకున్నారు. శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్ బస్సులు నిండిపోవడంతో యాత్రికులు ఫుట్‌బోర్డులపై ప్రయాణించారు. ఫుట్‌బోర్డు ప్రయాణం వద్దని ఆర్టీసి సిబ్బంది వారించినా యాత్రికులు పట్టించుకోలేదు. మరో వైపు జక్కంపూడి వైవీ.రావు ఎస్టేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ శాటిలైట్ స్టేషన్ ఆదివారం పుష్కర యాత్రికులతో నిండిపోయింది. మరో వైపున భవానీపురం స్నాన ఘాట్లు యాత్రికులతో నిండిపోవడంతో పుష్కర స్పెషల్ బస్సులను గొల్లపూడి వైపు మళ్లించారు. బస్సులను నైనవరం ఫ్లైవోవర్ మీద నుంచి కాకుండా జక్కంపూడి మీదగా గొల్లపూడి స్నాన ఘాట్లకు తరలించారు. అయితే పుష్కర యాత్రికులకు సరైన సమాచారం లేకపోవడంతో కొంత మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంకలో చంటి పిల్లలతో చేతిలో లగేజీలో ఎటు వెళ్లాలో తెలియన అనేక మంది యాత్రికులు తీవ్ర ఆగచాట్లకు గురయ్యారు.
Advertisement
Advertisement