ఇంద్రకీలాద్రికి పుష్కరశోభ
ఇంద్రకీలాద్రికి పుష్కరశోభ
Published Sat, Aug 13 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
రెండో రోజు పెరిగిన రద్దీ
60 వేల మందికి అమ్మవారి దర్శనం
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై పుష్కర శోభ వెల్లివిరిసింది. కృష్ణా పుష్కరాల రెండో రోజైన శనివారం పుష్కర స్నానానికి యాత్రికులు తరలివచ్చారు. పుష్కర స్నానం పూర్తి చేసుకున్న తర్వాత క్యూలైన్ మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. పుష్కరాలను పురష్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగింది. రెండో రోజు శనివారం మొత్తం 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నాం మహా నివేదన అనంతరం రద్దీ మరింతగా పెరగడంతో అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా మండపంలోని ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి మహా ప్రసాదం లడ్డూతో పాటు భవానీ ప్రసాదాలను భక్తులు విరివిగా కొనుగోలు చేశారు.
టోల్‌గేట్ వద్ద వివాదం...
తొలి రోజున సినీ నటుడు బాలకృష్ణను ప్రయివేటు వాహనంపై కొండపైకి అనుమతించడంతో పోలీసు రెవెన్యూ అధికారులపై ఈవో సూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆలయ ఈవో వ్యవహారంపై గుర్రుగా ఉన్న ఈ రెండు శాఖల అధికారులు ఉత్సవాలలో తాము ఖఠినంగా వ్యవహరిస్తే ఏలా ఉంటుందో దేవస్థాన అధికారులకు తెలిసేలా చేశారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్‌తో పాటు దుర్గగుడి అధికారుల వాహనాలను కొండపైకి అనుమతించలేదు. దీంతో సూర్యకుమారి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
లిఫ్టు సదుపాయం పోలీసు, వీఐపీలకేనా...
మహామండపం వైపు నుంచి కొండపైకి ఎవరిని అనుమతించేది లేదని చెప్పిన ఈవో సూర్యకుమారి మాటలు పట్టించుకోవడం లేదు. పోలీసు సిబ్బందితో పాటు వారి బంధువులు, వీఐపీల పేరిట అనేక మంది లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు.
నమూనా ఆలయంలో కల్యాణోత్సవం
సంగమం సమీపంలోని నమూనా ఆలయానికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు తరలివెళ్లారు. సంగమం వద్ద ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో శనివారం కల్యాణోత్సవం నిర్వహించారు.
రెండో రోజు ఆదాయం రూ.9.06 లక్షలు..
పుష్కరాలలో రెండో రోజు దుర్గగుడికి రూ.9.06 లక్షల ఆదాయం వచ్చింది. రూ.500 వీఐపీ టికెట్ల విక్రయం ద్వారా రూ.2.08 లక్షలు, 60,900 లడ్డూ విక్రయాల ద్వారా రూ.6.09 లక్షలు, భవానీ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 67,350లు, కేశకండన ద్వారా రూ. 20,850ల ఆదాయం సమకూరింది.
Advertisement
Advertisement