వైఎస్‌ఆర్ సీసీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు బత్తుల నాని అరెస్టు చేస్తున్న పోలీసులు
బంజారాహిల్స్: ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు బంజారాహిల్స్‌లోని మినిష్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ చారి, నగర అధ్యక్షుడు బత్తుల నాని ఆధ్వర్యంలో విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ మినిష్టర్స్ క్వార్టర్స్ వైపు ర్యాలీగా బయలుదేరారు.
క్వార్టర్స్‌కు చేరుకునేలోపే ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని బత్తుల నాని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ముట్టడి కార్యక్రమం తలపెట్టామన్నారు. మినిష్టర్స్ క్వార్టర్స్ వైపు దూసుకెళ్లేందుకు యత్నిస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో విద్యార్థి విభాగం నేతలు అశోక్, శివారెడ్డి, అక్షయ్, వినోద్, సంజయ్, దీపక్, వాసు, భరత్, మధు, తదితరులు ఉన్నారు.