ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తా | Question of the government's failures | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తా

Published Mon, Jul 18 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

మల్లుభట్టి విక్రమార్క,  మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

మల్లుభట్టి విక్రమార్క, మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే, మధిర
––––––––––––––––––––––––––

  • నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీరుస్తా
  •  ప్రజా అవసర పనులు పూర్తి చేయిస్తా
  •  సర్కారు నియంత పోకడలు పోవద్దు
  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు
  •  ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో వేలకోట్ల అవినీతి


మధిర:
‘ప్రతిపక్షాలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. నియంత పోకడ పోతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. పైగా..మాటలతో, భ్రమలతో కాలం వెళ్లదీస్తున్న పాలన ఇది. ప్రజల అవసరాలకనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయించాల్సి ఉండగా..ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు. పేదలకు ఇళ్లు దక్కడం లేదు. ప్రాజెక్ట్‌లు పూర్తి కావడం లేదు. కానీ..వేల కోట్లు మాత్రం అవినీతి రూపంలో స్వాహా అయిపోతున్నాయి. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తా. ప్రభుత్వాన్ని నిలదీస్తా, ప్రజా పక్షాన నిలుస్తా..’ అని మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లుభట్టి విక్రమార్క అన్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

  • జాలిముడి ప్రాజెక్ట్‌తో సస్యశ్యామలం..

మధిర మండలంలోని వైరానదిపై జాలిముడి వద్ద నిర్మించిన సాగునీటి ప్రాజెక్ట్‌తో మధిర, బోనకల్‌ మండలాల్లో ఐదు వేల ఎకరాలకు పైగా సస్యశ్యామలం అవుతుంది. తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌ మండలాల పరిధిలోని 53 గ్రామాలకు మంచినీరు అందుతుంది. త్వరలోనే దీనిద్వారా నీటిని సరఫరా చేయిస్తాం. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణాల్లో అవినీతి జరిగిందని అధికారపార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. వారికి ధైర్యం ఉంటే సీబీఐ విచారణ జరిపించాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన నిబద్ధత చాటుకోవాలి.

  • పథకాల అమలుపై..

రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సమర్థంగా అమలు చేయడం లేదు. గతంలో కాంగ్రెస్‌ పాలనలోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, 104 సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను నీరుగారుస్తున్నారు. అప్రాధాన్యత పనులకు ప్రభుత్వం వెంపర్లాడుతోంది. పరిపాలన అనుభవంలేని, బాధ్యతలేనివారు చేసే పనులు ఇలాగే ఉంటాయి.

  • ఎన్నికల హామీలపై..

ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు..ఇలా ఏ హామీ నెరవేర్చడం లేదు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న నాయకులను బెదిరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గ్రామజ్యోతి, మన ఊరు–మన ప్రణాళిక వంటి కార్యక్రమాల్లో స్థానిక సంస్థలకు కావాల్సిన పనులను గుర్తించి..ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. కేంద్ర నిధులను కూడా పక్కదారి పట్టించడం దుర్మార్గం. ప్రతినెలా ఒకోటో తారీఖున కాకుండా పింఛన్లను నెలచివర్లో ఇస్తున్నారు. బ్యాంకులకు వెళ్లే క్రమంలో పలువురు వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి.

  • ప్రాజెక్ట్‌ పనులపై..

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 70–80శాతం వరకు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరిగింది. మరికొన్ని నిధులు కేటాయిస్తే..పూర్తికానున్నాయి. ఇందిరా సాగర్, రాజీవ్‌సాగర్‌కు రూ.475కోట్లు పూర్తిచేస్తే అవి వినియోగంలోకి వస్తాయి. కానీ రూ.8వేలకోట్లతో సీతారామ ప్రాజెక్ట్‌ నిర్మాణం పేరుతో ప్రభుత్వం ప్రజా ధనాన్ని లూటీ æచేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్ట్‌కు రూ.26వేలకోట్ల నిధులతో పూర్తిచేయకుండా రూ.84వేలకోట్లకు పెంచి రీడిజైనింగ్‌ పేరుతో అవినీతికి తెర లేపుతున్నారు.

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలపై..

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనాలకు వివరిస్తున్నాం. పార్టీ సంస్థాగత నిర్మాణం అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement