హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినందుకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, వేరబుల్స్ విక్రయాలను మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్‌ఏ) నిర్ణయించింది. అతి తక్కువ మార్జిన్స్, వారంటీ క్లెయిమ్స్ ఆలస్యం కావడం, బలవంతంగా కొన్ని ఉత్పత్తులను రిటైలర్లపై రుద్దడం వంటి సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ వెల్లడించింది.
ఆన్‌లైన్‌కు అనుకూలంగా వన్‌ప్లస్ వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు వన్‌ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఓఆర్‌ఏ లేఖ రాసింది. పూర్విక, బిగ్–సి, సంగీత, హ్యాపీ, బీ–న్యూ, సెలెక్ట్, సెల్ పాయింట్ వంటి 23 ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్స్ ఓఆర్‌ఏ సభ్యులుగా ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో సుమారు 4,500 స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment