బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య
హుస్నాబాద్/చిగురుమామిడి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కావాలని కేంద్రాన్ని కోరకుండా చిన్న చిన్న విషయాల కోసం చిప్ప చేతిలో పట్టుకుని బిచ్చమెత్తుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీ చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, హుస్నాబాద్, తిమ్మాపూర్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో 112 బీసీ కులాలున్నాయని, 120 సార్లు రాజ్యాంగాన్ని సవరించినా బీసీల సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో 70 కోట్ల మంది బీసీలున్నారని, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేసి 80 శాతం సబ్సిడీపై రుణాలు అందించాలని కోరారు.
రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్, అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్లకు నామినేటేడ్ పదవులను ఇచ్చి గౌరవిస్తున్నంత కూడా బీసీలను గౌరవించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా నాలుగేళ్లుగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని కులాలను బీసీలో చేర్చాలని ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఆ రాష్ట్రాల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని 2019 ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారం కోసం బీసీలంతా సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
'ఇద్దరు సీఎంలు బిచ్చమెత్తుకుంటున్నారు'
Published Tue, Jun 14 2016 8:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement