'అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు'
- ప్రత్యేక హోదా పక్కన పెట్టి అసెంబ్లీ సీట్లు పెంచమంటారా?
- 5న జరిగే ఓటింగ్‌తో బాబు బండారం తేలుస్తాం
- పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
గోపాలపట్నం (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. అధికారంలోకి రావడానికి, చేసిన తప్పులు, అవినీతి నుంచి కాపాడుకోడానికి బీజేపీకి కొమ్ముకాసి ప్రత్యేక హోదా పక్కనపెట్టేశారని ధ్వజమెత్తారు. గోపాలపట్నంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు నివాసంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో ప్రధాని మోదీపై వత్తిడి తేకుండా టీడీపీలోకి వలసవచ్చిన ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరడం సిగ్గుచేటని ఆక్షేపించారు. చంద్రబాబు వైఖరి మారకుంటే జనాగ్రహ మంటల్లో కాలిపోతారని హెచ్చరించారు. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ హోదా కోసం హామీలిచ్చారని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య పదేళ్ల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారని, చంద్రబాబు పదిహేనేళ్లు ఇవ్వాలన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై ఇపుడు చంద్రబాబు మాటల్ని వింటే బాధగా ఉందని, ప్రత్యేక హోదా ఏమయినా సంజీవినా, గతంలో హోదా పొందిన 15 రాష్ట్రాల్లో ఏమయినా ఒరిగిందా అని చులకనగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేకహోదా ప్రకటించలేదని కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేయగా, అసెంబ్లీసీట్లు పెంచాలని టీడీపీ ఎంపీ రమేష్ కోరారని, సుజనాచౌదరి మాత్రం మాటవరసకైనా ప్రత్యేక హోదా కోరకుండా తన చేతకానితనాన్ని రుజువు చేసుకున్నారన్నారు. చంద్రబాబు ఒకవైపు, తన కొడుకు లోకేష్ మరో వైపు అవినీతికి పాల్పడుతూ, ఓటుకి నోటు కేసులో కూడా దొరికిపోయారని, తమ బండారం బయటపడుతుందన్న భయంతోనే రాష్ట్ర అవసరాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలని మొట్టమొదక లేఖ ఇచ్చింది చంద్రబాబేనని, మొత్తం ద్రోహమంతా బాబుదేనని అన్నారు. ఈనెల 5న పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా అంశం ఓటింగ్‌కు రానుందని, దీనికి కాంగ్రెస్‌తో పాటు 11రాజకీయ పార్టీలమద్దతు ఇస్తున్నాయని, ఆ రోజు టీడీపీ వైఖరి ఏమిటో తేలిపోతుందన్నారు.