బాబుకు ఆయన మార్కెటింగ్ ఏజెంట్ !
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అధ్యాయం ఇంకా ముగియలేదని... ముగిసిందల్లా బీజేపీ, టీడీపీ భాగోతాలనేనని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. హోదా అధ్యాయం ముగిసినట్లేనని చెప్పేందుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.
ఇందిరాభవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు మార్కెటింగ్ ఏజెంట్‌గా, రాష్ట్ర ప్రభుత్వానికి సీఈఓగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దిగజారి పోయారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టాలని పీసీసీ తరపున సంపూర్ణ విశ్వాసంతో కోరుకుంటున్నట్లు తెలిపారు.
బీజేపీ, టీడీపీ పార్టీల పరిస్థితి సాలెపురుగు గూడులా తయారైందన్నారు. సాలె పురుగు తన ఆహారం కోసం గూడును తన చుట్టూ కట్టుకుంటుందని చివరకు అది బయటకు రాలేని పరిస్థితిలోనే ఉంటుందన్నారు. గూడులో పడ్డ క్రిములు పురుగుకు ఆహారం అవ్వడం తథ్యమని, అలాగే టీడీపీ, బీజేపీ పార్టీల్లోకి వెళ్లే వారి పరిస్థితి కూడా అథోగతేనని పునరుద్ఘాటించారు. చిరంజీవి కడదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారన్నారు. పార్టీ మారతారని వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదన్నారు. తన 150వ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న కారణంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రఘువీరా సమాధానమిచ్చారు.