మంగళసూత్రాలు కూడా లాక్కునే ప్రయత్నం
– చిల్లర నోట్లు తీసుకురాకపోతే సివిల్ వార్ వస్తుంది
– పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి
హిందూపురం అర్బన్ : మహిళలు ఎంతో పవిత్రంగా చూసుకునే మంగళసూత్రాలు కూడా బంగారంటూ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ అ«ధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఆదివారం హిందూపురం విచ్చేసిన ఆయన కూల్చివేసిన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని çపరిశీలించారు. అనంతరం అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరువ్యాపారులు నెల రోజుల్లో రూ.25 వేలు నుంచి రూ.60 వేలు వరకు నష్టం వచ్చిందని వాపోయారు. రూ.2 వేలు తీసుకువస్తే చిల్లర ఇచ్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని, సీఎంలు నల్లకుబేరులను పట్టుకునేందుకు చేతకాక పిచ్చుకపై బ్రమ్మాస్త్రం ప్రయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
అనంతరం రఘువీరా మాట్లాడుతూ ప్రజలను ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగులను భిక్షగాళ్లలా తయారు చేశారని మండిపడ్డారు. ఎంతమంది నల్లకుబేరులకు సంకెళ్లు వేశారని ప్రశ్నించారు. చిల్లరనోట్లు తీసుకురాకుంటే ప్రజల్లో సివిల్ వార్ వస్తుందన్నారు. డబ్బు ఇబ్బందులతో చనిపోయిన వారిని ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్ నిర్మిస్తామని 18 నెలలు క్రితం కూల్చివేసి ఇప్పటివరకు నిర్మించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజి మనోహర్, పీసీసీ కార్యదర్శి ఇందాద్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రహమత్, జబీ, సీనియర్ నాయకులు ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు.