వానొస్తే.. పాఠాలు లేనట్లే!
-
శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ బడులు
-
భయందోళన మధ్య విద్యార్థుల చదువులు
-
ముఖ్యంగా వర్షాకాలంలో తీవ్ర అవస్థలు
-
27 స్కూళ్లు అద్దె భవనాల్లోనే..
-
1672అదనపు గదులు అవసరం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: శిథిలమైన పాఠశాలల భవనాలు.. చిటుకు పొటుకుమంటూ వర్షానికి నీళ్లు కారుతున్న తరగతి గదుల్లో చదువులు సాగిస్తున్న పేద విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నికావు. ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడుతుందో తెలియక భయాందోళనకు లోనవుతున్నారు. చినుకుపడితే చాలు చెరువులా మారుతున్న వరండాలోనే పాఠాలు వింటున్నారు. ఇవి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా వర్షాకాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు..జిల్లా లోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లోని పాతభవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తేచాలు తరగతి గదులు కురుస్తున్నాయి. దీనికితోడు తరగతి గదుల ఉండడంతో కిక్కిరిసి కూర్చుని చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వారంరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ బృందం పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి.
-
జిల్లాలో 2,527 ప్రాథమిక, 555ప్రాథమికోన్నత, 577ఉన్నతపాఠశాలలు కలిపి మొత్తం 3,659 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 4.19లక్షల మంది విద్యార్థులు కొనసాగిస్తున్నారు. 3,659పాఠశాలల్లో 3,632 పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నాయి. 27 పాఠశాలలు భవనాలు
అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అదేవిధంగా 16,488 అదనపు తరగతి గదులు అవసరం ఉండగా, 14,816 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 1672అదనపు తరగతి గదులు ఇంకా నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా 861 స్కూళ్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. అరకొర వసతులు ఉన్నప్పటికీ చదువుకునేందుకు ఆసక్తితో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు వర్షం కురిసినప్పడు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శిథిలావస్థకు చేరిన భవనాలు కురుస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో అందరిని ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి భవనాలు ఎప్పుడు కూలుతాయోనని భయం భయంగా పాఠాలు వింటున్నారు. గదులు సరిపోకపోవడంతో ఆరుబయట, చెట్లకిందే కూర్చుని చదువుకునే విద్యార్థులకు వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్‌నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.