జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా జిల్లాలోని 49 మండలాల పరిధిలో 3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దపప్పూరు 36.3 మి.మీ, తాడిపత్రి 21.4 మి.మీ, గుంతకల్లులో 14.6 మి.మీ, గార్లదిన్నెలో 11.6 మి.మీ, యాడికిలో 10.5 మి.మీ వర్షం కురిసింది. డి.హిరేహాళ్, వజ్రకరూరు, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, పామిడి, కూడేరు, ఉరవకొండ, కనేకల్లు, గుమ్మఘట్ట, పుట్లూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, అమరాపురం, రొళ్ల తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. 14 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ఇప్పటికే 96.3 మి.మీ నమోదైంది. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 215 మి.మీ గానూ 13 శాతం తక్కువగా 186.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
వర్షసూచన: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు 4 నుంచి 26 మి.మీ మేర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. గంటకు 6 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.