అకాల వర్షం.. అపార నష్టం
అకాల వర్షం.. అపార నష్టం
Published Sat, Mar 18 2017 9:56 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
మెట్ట, ఏజెన్సీ మండలాల్లో గాలివాన బీభత్సం
జంగారెడ్డిగూడెంలో వడగళ్లు
కూలిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు
నేలకొరిగిన మొక్కజొన్న
మామిడి, అరటి, ఆయిల్‌పామ్ పంటలకు నష్టం
జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్ :
మెట్ట ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురు గాలులు తీవ్ర నష్టం కలిగించాయి. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకోగా.. భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. జంగారెడ్డిగూడెంలో ఈదురు గాలులకు 20కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కొబ్బరి, మామిడి చెట్లతోపాటు ఇతర వృక్షాలు నేలకొరిగాయి. తాటాకిళ్లు నేలమట్టమయ్యాయి. సిమ్మెంట్ రేకులతో నిర్మించిన ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కేవలం 10 నిమిషాలలోపే ఇదంతా జరిగిపోయింది. మొక్కజొన్న, అరటి, ఆయిల్‌పామ్ తోటలతోపాటు పలుచోట్ల వరి పంట నేలనంటాయి. మామిడికాయలు రాలిపోయాయి. ఒక్క జంగారెడ్డిగూడెం మండలంలోనే 600 హెక్టార్లలో మొక్కజొన్న పంట నేలకొరిగినట్టు వ్యవసాయ అధికారి ఎస్.చెన్నకేశవులు తెలిపారు. వడగండ్ల వాన వల్ల మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంటనష్టం అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
ఏజెన్సీలో
ఏజెన్సీ గ్రామాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. పోలవరం మండలంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని భారీ వర్షం కురిసింది. మొక్కజొన్న చేలలో ఆరబెట్టిన పంట తడిసిపోయింది. ఉదయం నుంచీ ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఒక్కసారిగా వర్షం కువరడంతో రైతులు పంటను కాపాడుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి కోతకోయని తోటల్లో మొక్కజొన్న నేలకొరిగింది. బుట్టాయగూడెం మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత కనిపించగా.. వేడి గాలులు వీచాయి. సుమారు 3 గంటల సమయంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుని వడగండ్లు పడ్డాయి. కాసేపటికే గాలివాన బీభత్సం సృష్టించింది. అరగంటపాటు కురిసిన గాలివానకు వృక్షాలు కూలిపోయాయి. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగి వైర్లపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 8 గంటల సమయానికి కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పరిస్థితి లేకపోవడంతో గిరిజన గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. బుట్టాయగూడెం సంతకు ఆటంకం కలిగింది.
నల్లజర్లలో జల్లులు
నల్లజర్లలో మోస్తరు గాలులతో కూడిన జల్లులు కురిశాయి. మూడు రోజుల క్రితం కురిసిన గాలివానకు మొక్కజొన్న పంట నేలవాలగా.. శనివారం కురిసిన జల్లులు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. మండలంలో 4,400 హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తుండగా.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు శింగరాజుపాలెం, మారెళ్లమూడి గ్రామాల్లో 100 హెక్టార్లలో పంట నేలవాలింది. శనివారం జల్లులు కురవడంతో మిగిలిన రైతులు పంట ఏమైపోతుందోనని కంగారుపడ్డారు. జల్లులతో సరిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నగర వాసులకు ఉపశమనం
ఏలూరులో శనివారం కురిసిన అకాల వర్షం నగర వాసులకు ఊరటనిచ్చింది. 10 రోజులుగా భానుడి ధాటికి అల్లాడిపోతున్న ప్రజలు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. సుమారు అరగంటపాటు భారీ వర్షః కురవడంతో పలుచోట్ల రోడ్ల వెంబడి నీరు నిలిచిపోయింది.
Advertisement
Advertisement