మెట్టకు నష్టం
మెట్టకు నష్టం
Published Sat, Mar 11 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
నిడదవోలు రూరల్/కొవ్వూరు : ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం మెట్ట ప్రాంత రైతులను నిలువునా ముంచేసింది. వాణిజ్య పంటల్ని నేలకూల్చి అపార నష్టానికి గురి చేసింది. మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లగా.. అరటి, నిమ్మ, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి దుబ్బులు సైతం నేలనంటాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు, ద్వారకాతిరుమల, జీలుగుమిల్లి, టి.నరసాపురం, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొవ్వూరు గరిష్టంగా 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాగల్లులో 13.8, ద్వారకా తిరుమలలో 8.8, జీలుగుమిల్లిలో 7.2, నిడదవోలులో 9.2, తాడేపల్లిగూడెంలో 1.2, దెందులూరు 6.2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది.
దెబ్బతీసిన ఈదురుగాలులు
ఈదురు గాలుల తీవ్రతకు వాణిజ్య పంటలు నేలకొరిగాయి. నిడదవోలు మండలం తాడిమళ్ల, కోరుమామిడి, సూరాపురం, రావిమెట్ల, కంసాలిపాలెం, కాటకోటేశ్వరంలో 800 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలగా, మరో 100 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. నేలవాలిన పంట లను మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ పరిశీలించారు. నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపోవడంతో గ్రామాలు అంధకారంలో మగ్గాయి. దెందులూరు మండలం చల్లచింతలపూడి, కొత్తకమ్మవారిగూడెం, కేఎన్ పురం, తిమ్మనగూడెం, పెరుగ్గూడెం, మేదినరావుపాలెం గ్రామాల్లో 300 ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి. ఉంగుటూరు మండలం నీలాద్రిపురం, నల్లమాడు, గోపీనాథపట్నం, గొల్లగూడెం, రామచంద్రపురం గ్రామాల్లో 692 హెక్టార్లలో అకాల వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతింది. అక్కడక్కడా వరిచేలు, అరటి దెబ్బతిన్నాయి. భీమడోలు మండలం పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్‌పేట, దుద్దేపూడి, అన్నేవారిగూడెం తదితర గ్రామాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. ఎకరానికి రూ.23 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. చివరి దశలో ఉన్న వరి పంటకు సైతం నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పలు గ్రామాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాగల్లు మండలంలో శనివారం వేకువజామున ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. చాగల్లు, నెలటూరు తదితర గ్రామాల్లో మొక్కజొన్న, ఆరటి తోటలు నేలకొరిగాయి. పలుచోట్ల వరిచేలు కూడా నేలనంటాయి. చిక్కాల, కలవలపల్లిలో మామిడి కాయ లు నేలరాలాయి. చంద్రవరం, మల్లవరంలో అరటి తోటలు పడిపోయాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Advertisement