
చినుకు పడితే చిత్తడే
పట్టణంలో రెండురోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
→ ఎక్కడికక్కడే నిలిచిన వర్షపు నీరు
→ఇబ్బందులు పడుతున్న పురం ప్రజలు
హిందూపురం అర్బన్ / టౌన్ : పట్టణంలో రెండురోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మేళాపురం, హస్నాబాద్, ముక్కడిపేట, త్యాగరాజనగర్ ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల జీవనానికి తీవ్ర అవరోధంగా మారింది. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, కాల్వలను శుభ్రం చేయకపోవడంతో వర్షపునీరు ముందుకు ప్రవహించకుండా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వీధులన్నీ మురికిమయంగా మారాయి. పాదచారులు సైతం వీధుల్లో నడవలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల మార్కెట్‌లో కాలు పెట్టడానికి కూడా వీలులేకుండా పోయింది.
దీంతో పాటు ఆటోనగర్, ముద్దిరెడ్డిపల్లి ధన్‌రోడ్డులోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే దుస్థితి ఉంటున్నా పాలకుల్లో స్పందన కరువైందని ప్రజలు వాపోతున్నారు. రెండురోజుల్లో సుమారు 64మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా మేళాపురం దీప్తిస్కూల్ వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో వర్షపునీరు కొలనులా నిలిచింది. దీంతో విద్యార్థులు ఈ దారి గుండా వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా పట్టించుకునే వారు కరువయ్యారు.