అను‘బంధం’ పిలుస్తోంది..! | Rakhi fest | Sakshi
Sakshi News home page

అను‘బంధం’ పిలుస్తోంది..!

Published Thu, Aug 18 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

Rakhi fest

అన్నాచెల్లెల అనుబంధం రాఖీ అనే రెండక్షరాలతో ద్విగుణీకృతమవుతోంది.. అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తోంది.. సోదరసోదరీభావాలను వ్యక్త పరుస్తోంది.. అన్నింటికీ మించి రక్తసంబంధ బాంధవ్యాలను గుర్తుకు తెస్తోంది.. కష్టాలు ఎదురైనా, సుఖసంతోషాలతో ఎల్లలు దాటిపోయినా రాఖీ పండుగ నాడు కలుసుకుని ఆనందం పంచుకోవాలని గుర్తు చేస్తోంది. యాంత్రిక జీవనం సాగిస్తున్నా.. ఆధునిక శాస్త్రసాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకుని కొందరు రాఖీలను చేరవేస్తుండగా చాలామంది స్వయంగా తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు సొంతూళ్లబాట పడుతున్నారు. గురువారం జరిగే రాఖీ పౌర్ణమి సందర్భంగా వివిధ వర్గాలు, అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
– సాక్షి నెట్‌వర్క్‌
 
అన్నకోసం అమెరికాకు.. – వి.వైష్ణవి, వేములవాడ 
మా అన్నయ్య వికాస్‌ అమెరికాలో సాఫ్ట్‌వేట్‌ ఉద్యోగి. అంతదూరం వెళ్లడం కుదరదు కనుక రాఖీని స్పీడ్‌ పోస్టులో అమెరికా పంపించా. అదే స్పీడ్‌పోస్టు ద్వారా మా అన్నాయ్య మాకు స్వీట్‌ లేదా గిఫ్ట్‌లు పంపిస్తుంటారు. 
 
విదేశాల్లో ఉన్నా అన్నకోసం.. – స్వాతి, బర్మింగ్‌హోమ్, అమెరికా
బర్మింగ్‌హోమ్‌లో ఉన్నత చదువు కొనసాగిస్తున్న. మా అన్నయ్య వేణు వేములవాడలో ఉంటున్నరు. అమెరికా నుంచి ఆయనకు నేను రాఖీ పంపించిన. అన్నాచెల్లెల అనుబంధానికి ఇది గుర్తు.
 
రాఖీ కట్టలేకపోతున్న – మాధవి, సీఐ, వేములవాడ రూరల్‌
మాది పోలీసు కుటుంబం. మా పెద్దన్నయ్య వీవీ రమణమూర్తి హుజూరాబాద్‌ సీఐ. చిన్నన్నయ్య వి.యుగంధర్‌ అనంతపూర్‌ జిల్లా రామగిరి సీఐ. మేం ఎప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తామో తెలియదు. నేను కృష్ణా పుష్కరాల్లో ఉండడంతో వారికి రాఖీ కట్టలేకపోతున్న. అన్నయ్యలు బాగుండాలని ఇక్కడ్నుంచే మొక్కుకుంట.
 
చిన్నాన్న కుమారులకు రాఖీలు కడతా – ఉమారాణి, ఏఈవో, రాజన్న ఆలయం, వేములవాడ
మేం నలుగురం అక్కా–చెల్లెళ్లం. అన్నదమ్ములు లేరు. కరీంనగర్‌లోని మా చిన్నాన్న కుమారులకు రాఖీలు కడతా. లేదా వాళ్లే ఇక్కడికి వస్తరు. మా కొలీగ్స్‌ కూడా రాఖీలు కట్టి అన్నాచెల్లెల అనుబంధం గుర్తు చేసుకుంట. 
హ్యాపీగా ఉంటది – గంగం గీతారాణి, హోమియోవైద్యురాలు, ముల్కనూర్, భీమదేవరపల్లి
మాది వరంగల్‌ జిల్లా నర్మెట మండలం అమ్మపూర్‌. మా అక్కయ్య సంధ్యారాణి, నేను, తమ్ముడు గోపాల్‌కృష్ణారెడ్డి. తమ్ముడు ఎల్‌కేజీ నుంచి మెడిసిన్‌ వరకు నావద్దే ఉన్నాడు. అమ్మకంటే ఎక్కువ నా వద్ద ఉంటున్నాడు. దాదాపు ముప్పయి ఏళ్లుగా తమ్ముడికి రాఖీ కడతా. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నా వెళ్లి కట్టిరావడం హ్యాపీ. 
==============================================================
కరీంనగర్‌ కల్చరల్‌ 
 
ముగ్గురికి రాఖీలు– డాక్టర్‌ ఆకుల శైలజ, కరీంనగర్‌
 మాది వరంగల్‌. అత్తయ్య వాళ్లది కరీంనగర్‌. నాకు అన్నదమ్ములు లేరు. కరీంనగర్‌లో ఆస్పత్రి ప్రారంభించినప్పచి అనెస్తీషియన్‌ ఓంప్రసాద్‌కు రాఖీ కడుతున్న.  పదిహేనేళ్ల కిత్రం శ్రీకృష్ణ మందిరంలో పరిచయమై అక్కయ్య అని పిలిచే లెక్చరర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మెడికల్‌ రిఫ్‌ శ్రీకాంత్‌కు ఏడాదిగా రాఖీలు కడుతున్న.
 
అనుబంధానికి వారిధి – ఆర్‌.నాగలక్ష్మి, ఏఎంవీఐ, సిరిసిల్ల
మాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. తమ్ముడు నరేశ్‌ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఒక అక్క ఉంది. తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు ఉద్యోగం రాకముందు నుంచీ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకునేవాళ్లం. విధినిర్వహణలో భాగంగా ఈసారి తమ్ముడికి రాఖీ కట్టే అవకాశం లేకుండాపోయింది.
 
ఈసారి మా ఇంట్లోనే పండుగ – వి.స్వరూపరాణి, ఆర్వో, సిరిసిల్ల మున్సిపాలిటీ
మాది సొంతూరు సిరిసిల్ల. అమ్మానాన్నలు గాలిపల్లి లక్ష్మి– సత్యనారాయణ. మేం ఆరుగురం అక్కాచెల్లెల్లం. తమ్ముడు చిన్నోడు హరీశ్‌. హైదరాబాద్‌లో హార్డ్‌వేర్‌ ఉద్యోగి. తమ్ముడంటే మాకేంతో ఇష్టం. ఈసారి రాఖీపండుగ కరీంనగర్‌లోని మా ఇంట్లోనే జరుపుకుంటం.
 
ఒక్కడే తమ్ముడు – వెంకటలక్ష్మి, మున్సిపల్‌ ఆర్‌ఐ , సిరిసిల్ల
మాది ఖమ్మం. నాకు ఒక్కడే తమ్ముడు క్రాంతికుమార్‌. రాఖీపండుగను ఎంతో వేడుకగా చేసుకుంటాం. ఈసారి పండక్కి వెళ్లలేకపోతున్నాను. తమ్ముడు రాఖీ కట్టి మురిసిపోయేదాన్ని.
హ్యాపీగా ఫీలవుతాం – విజయలక్ష్మి, ఎక్సైజ్‌ సీఐ, హుస్నాబాద్‌
నాకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు. అన్నయ్యలకు రాఖీలు కట్టడం హ్యాపీగా ఫీలవుతం. వృత్తిరీత్యా ఎక్కడ ఉన్నా రాఖీపండుగ రోజు కుటుంబసభ్యులమందరం కలుసుకుంటాం. రక్షాబంధన్‌ వేడుకులు జరుపుకుంటం.
 
పోస్ట్‌లో పంపిస్త– జానకి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ, హుస్నాబాద్‌
నాకు ఇద్దరు  అన్నదమ్ములు. వీలును బట్టి నేరుగా వెళ్లి రాఖీ కడతా. జాబ్‌ ఒత్తిడితో ఒక్కోసారి పోస్ట్‌లో రాఖీతోపాటు స్వీట్‌ పంపిస్తా. ఫోన్‌ ద్వారా శుభాంక్షలు తెలుపుతా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement