
స్వామి వారి సన్నిధిలో అమ్మవారికి పుష్పాభిషేకం చేస్తున్న అర్చకులు
భద్రాచలం:భద్రాద్రి రాముడికి శుక్రవారం నిత్యకల్యాణం వైభవంగా జరిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి నిత్య కల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేన పూజాది కార్యక్రమాలు నిర్వహించి కల్యాణం జరిపించారు. రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీతాయారమ్మ వారికి శ్రావణమాసపు శుక్రవారం సందర్భంగా ఉదయం పవిత్ర గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, హరిద్రాచూర్ణాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, పదిరకాల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన చేశారు. స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహం ఐదో రోజు కూడా కొనసాగింది. ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.