హైదరాబాద్‌కు రాణి రుద్రమదేవి పయనం | rani rudrama devi statue hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు రాణి రుద్రమదేవి పయనం

Published Wed, Nov 30 2016 10:26 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

హైదరాబాద్‌కు రాణి రుద్రమదేవి పయనం - Sakshi

హైదరాబాద్‌కు రాణి రుద్రమదేవి పయనం

జీవకళ ఉట్టిపడుతున్న శిల్పం
రాజ్‌కుమార్‌ శిల్పశాలలో రూపకల్పన
కొత్తపేట : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో నెలకొల్పేందుకు రాణి రుద్రమదేవి విగ్రహాన్ని కొత్తపేట నుంచి బుధవారం తరలించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ సమీపంలోని కాకతీయ హిల్స్‌ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. రుద్రమదేవి విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌కు కాకతీయ హిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అప్పగించింది. దీంతో వుడయార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విగ్రహాన్ని రూపొందించారు. 
రుద్రమదేవి విగ్రహం ద్వారా ‘ఆచార్య’ పురస్కారం 
తాను రుద్రమదేవి విగ్రహాన్ని తొలిసారి 2004లో వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీకి తయారు చేశానని శిల్పి రాజ్‌కుమార్‌ తెలిపారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అప్పటి గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిండే ద్వారా ’ఆచార్య’ గౌరవ పురస్కారాన్ని ఆ యూనివర్సిటీ తనకు అందజేసిందని చెప్పారు. తరువాత రుద్రమదేవి పరిపాలన సాగించిన వరంగల్‌ కోట వద్ద, 2005లో వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో నెలకొల్పిన విగ్రహాలను తానే రూపొందించానన్నారు. ఇది నాల్గవ విగ్రహమన్నారు. 
సజీవ శిల్పాల రూపశిల్పి రాజ్‌కుమార్ 
తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజ్‌కుమార్‌ నెలకొల్పిన విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయని కాకతీయ హిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రదాన కార్యదర్శి వి.ఎస్‌.ఆర్‌.గాంధీ అభినందించారు. తెలంగాణలో రాజ్‌కుమార్‌ తయారు చేసిన రుద్రమదేవి, జయశంకర్, చాకలి ఐలమ్మ తదితరుల అనేక విగ్రహాలు పరిశీలించిన తరువాత ఈ విగ్రహం బాధ్యతను ఆయనకే అప్పగించామన్నారు.77.15 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతానికి 2012లో కాకతీయ హిల్స్‌గా నామకరణం చేశామని తెలిపారు. ముఖద్వారంలో 72 అడుగులు వెడల్పు, 24 అడుగులు ఎత్తులో ఆర్చ్‌ నిర్మించామని, అక్కడే ఈ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ఈ నెలలోనే విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement