
చిన్నారి తల్లిని పరామర్శిస్తున్న కార్పొరేటర్లు భార్గవి, హేమ( దారుణానికి ఒడిగట్టిన దీపుసింగ్ )
చిలకలగూడ: అమ్మ పొత్తిళ్ల వెచ్చదనాన్ని అనుభవిస్తున్న పసిపాపపై మానవ మృగం పంజా విరిసింది. ఏడాది వయసున్న చిన్నారిపై ఓ కాంమాధుడు మాటల్లో చెప్పలేని.. అక్షరాల్లో రాయలేని దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావమైన చిన్నారి చావుబతుకుల మధ్య గాంధీ ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది.
హృదయాలను కదిలించే ఈ దుర్ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ ఠాణా పరిధి దూద్‌బావిలో మంగళవారం అర్ధరాత్రి చోటుసుకుంది. ఉత్తర మండలం డీసీపీ సుమతి ఆదేశాల మేరకు చిలకలగూడ ఠాణాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోపాలపురం ఇన్‌చార్జి ఏసీపీ ఎస్.గంగాధర్, సీఐ కావేటి శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ కనోజ్ జిల్లా తాటియా రాణా పరిధిలోని సత్సార్ గ్రామానికి చెందిన శశికాంత్(23), భార్య ఆరతి నగరానికి వలసవచ్చి దూద్‌బావిలో నివసిస్తూ తోపుడుబండిపై మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ బతుకుతున్నారు. వీరికి రెండున్నర, ఏడాది వయసుగల ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వీరి గ్రామానికే చెందిన దీపుసింగ్ అలియాస్ దీపు(20) కూడా నగరానికి వచ్చి శశికాంత్ ఉంటున్న ప్రాంగణంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
మంగళవారం రాత్రి శశికాంత్, ఆరతి తమ ఇద్దరు పిల్లలను పక్కలో వేసుకుని పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక ఏడాది వయసు గల చిన్నారిని దీపుసింగ్ ఎత్తుకుపోయి బాత్‌రూంలోకి తీసుకెళ్లి పాప నోరునొక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని తీసుకువచ్చి తల్లితండ్రుల పక్కలో పడుకోబెట్టి జారుకున్నాడు. చిన్నారి ఏడుపుతో మెలకువ వచ్చిన తల్లితండ్రులు లేచి చూడగా ఒంటి నిండా రక్తంతో దారుణమైన పరిస్థితిలో కనిపించింది. ఈ అలికిడికి ప్రాంగణంలో ఉన్నవారంతా మేల్కొని చిన్నారి పరిస్థితి చూసి నివ్వెరపోయారు.
ఏడుస్తున్న చిన్నారిని బాత్‌రూం నుంచి దీపుసింగ్ ఎత్తుకుని రావడం చూసిన ఓ వ్యక్తి విషయాన్ని తెలిపాడు. వెంటనే పాపను గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. స్థానికులు దీపుసింగ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేయగా దారుణానికి ఒడిడట్టినట్టు ఒప్పుకున్నాడు. చిన్నారి తండ్రి శశికాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు దీపుసింగ్‌ను అదుపులోకి తీసుకుని బుధవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. మెట్టుగూడ, సీతాఫల్‌మండి కార్పొరేటర్లు పీఎన్ భార్గవి, సామల హేమ చిన్నారి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
పసిపిల్లలకు రక్షణ లేదు..
నగరంలో పసిపిల్లలకు రక్షణ లేదని మరో రుజువైందని, బాలల హక్కుల సంఘం చైర్మన్ అనురాధరావు అవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారం జరిగినప్పుడు ‘పోక్సో చట్టం’ ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సాయం అందించక పోవడం దారుణమన్నారు.