విజయదుర్గలో అరుదైన హృదయ చికిత్స
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో గుండెలో వచ్చిన లోపాన్ని కర్నూలు వైద్యులు సరిదిద్ది ఊపిరిపోశారు. ఆపరేషన్ వివరాలను శుక్రవారం శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. వసంతకుమార్ వెల్లడించారు. సాధారణంగా గర్భస్థ శిశువుకు పెద్దధమని, చిన్నధమని మధ్య డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్ ఉంటుందన్నారు. ఈ ట్యూబ్ గర్భస్థ శిశువుకు ఆరోగ్యానికి ఎంతో అవసరం అన్నారు. శిశువు గర్భం నుంచి బయటకు వచ్చాక మూడు నెలల్లో ఈ ట్యూబ్ పూడుకుపోతుందన్నారు. లేకపోతే బిడ్డకు గుండెపై ఒత్తిడి పెరిగి డొక్కలు ఎగరేయడం, బరువు తగ్గడం, సరిగ్గా తినలేకపోవడం, దగ్గు, ఆయాసం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయన్నారు.
ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్న కాకినాడకు చెందిన విజయలక్ష్మి(9) వారం క్రితం ఆసుపత్రికి వచ్చిందన్నారు. 2వేల మందిలో ఒకరికి ఈ సమస్య వస్తుందన్నారు. ఇలాంటి సమస్య ఉన్న వారికి గతంలో ఆపరేషన్ ద్వారా ట్యూబ్‌ను మూసివేస్తారన్నారు. కానీ విజయలక్ష్మికి ఆపరేషన్ లేకుండా డివైస్ క్లోజర్ పద్ధతిలో తొడ నరం ద్వారా గుండెకు ట్యూబ్‌ను పంపి తెరిచి ఉన్న డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్‌ను సరిచేశామన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ కింద ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో బాలిక విజయలక్ష్మి, ఆమె తండ్రి ఓబులనాయుడు, అనెస్తెటిస్ట్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.