హృదయవేదన | heart-burning | Sakshi
Sakshi News home page

హృదయవేదన

Published Thu, Aug 4 2016 9:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

హృదయవేదన

హృదయవేదన

ప్రాణ సంకటంలో నిండు గర్భిణి
నిమిషానికి 167 సార్లు కొట్టుకుంటున్న గుండె
దగ్గర పడుతున్న డెలివరీ తేదీ
ప్రసవ సమయంలో కార్డియాలజీ, గైనకాలజీ డాక్టర్ల పర్యవేక్షణ అవసరం

ఆపరేషన్‌కు రూ. 6 లక్షల ఖర్చు
బోరున విలపిస్తున్న గిరిజన దంపతులు

గూడూరు: పేద కుటుంబానికి పెద్ద జబ్బు వచ్చింది. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న దంపతులపై ఖర్చుల పిడుగు పడింది. భార్యకు వచ్చిన కష్టాన్ని చూడలేక భర్త.. ఆర్థిక ఇబ్బందులు ఎలా భరించాలని భా ర్య.. నిత్యం బోరున విలపిస్తున్నారు. దయామయులు ఆర్థికసాయం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గూడూరు శివారు కేశ్యతండాకు చెందిన వాంకుడోతు మహేందర్‌కు అదే తండాకు చెందిన భారతితో 2009లో పెళ్లి జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ దంపతులు తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2011లో వారికి ఒక పాప, 2013లో మరో అమ్మాయి జన్మించింది. అప్పటి వరకు ఎలాంటి జబ్బు లేని భారతికి ఆరునెలల తర్వాత ఒకసారి గుండె నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను మాను కోటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా రిపోర్టులను పరిశీలించిన డాక్టర్‌.. భారతిని హన్మకొండలోని కార్డియాక్‌ సెంటర్‌లో చూపించుకోమని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడి వైద్యుడి పరీక్షల ఆధారంగా మందులు వాడుకుంటూ వస్తోంది.

మూడోసారి గర్భం..
భారతి ఎనిమిది నెలల క్రితం మరోసారి గర్భం దాల్చింది. ఈ మేరకు అప్పటి నుంచి మానుకోటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించుకుంటూ ఆమె మందులు వాడుతోంది. అయితే అటు గుండె నొప్పి, ఇటు గర్భానికి సంబంధించిన మందులు వాడుకుంటూ వస్తున్న భారతికి మరో 20 రోజుల్లో డెలివరీ ఆపరేషన్‌ చేయాలని కన్సల్టెంట్‌ డాక్టర్‌ చెప్పారు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన ఆమెకు మరోసారి గుండెనొప్పి వచ్చింది. దీంతో భర్త, కుటుంబసభ్యులు భారతిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. ఆమె గుండె ఎక్కువగా కొట్టుకుంటుందని వెంటనే కార్డియాలజీ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ క్రమంలో వారు అక్కడి నుంచి తరచు చూపించుకునే హన్మకొండలోని గుండె వైద్య నిపుణుడి వద్దకు చేరుకున్నారు.

నిమిషానికి 167 సార్లు స్పందన
వాస్తవంగా ప్రతి మనిషికి నిమిషానికి 72 నుంచి 80 సార్లు గుండె కొట్టుకుంటోంది. కానీ.. భార తి గుండె నిమిషానికి 167 సార్లు కొట్టుకుంటుందని ఈసీజీ ద్వారా డాక్టర్‌ గుర్తించారు. దీంతో ప్రసవ సమయంలో గుండె నొప్పి వస్తే ఇబ్బందికరంగా ఉంటుం దని.. కార్డియాలజీ, గైనకాలజీ పర్యవేక్షణలో డెలివరీ చేయించాలని ఆయన కుటుంబసభ్యులకు సూచించారు. అయితే ఇంతటి పెద్ద వైద్యానికి రూ. 6 లక్షల వరకు ఖర్చవుతోందని డాక్టర్‌ చెప్పడంతో భారతి దంపతులు బోరున విలపిస్తున్నారు. 

వర్తించని ఆరోగ్యశ్రీ వైద్యం..
భారతికి ఆరోగ్యశ్రీ పథకం కింద డెలివరీ ఆపరేషన్‌ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆమె భర్త మహేందర్‌ చెబుతున్నారు. కార్డియాలజీ, గైనకాలజీ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రసూతి చేసే అవకాశం ఆరోగ్యశ్రీలో లేదని వారు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి
మాది నిరుపేద కుటుంబం. రోజు కూలీ పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితి ఉంది. గతంలో వైద్య ఖర్చుల కోసం రెండెకరాల్లో కొంత భూమిని అమ్మినా. నా భార్య గుండె ఎక్కువగా కొట్టుకుంటుండడంతో డాక్టర్లు ఇక్కడ ఆపరేషన్‌ చేసేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేయించాలంటే రూ. 6 లక్షలు ఖర్చవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. మరో 20 రోజుల్లో డెలివరీ డేట్‌ ఇచ్చారు. ఏం చేయాలో తెలియడం లేదు. దయామయులు కరుణించి ఆర్థిక సాయం అందించి నా భార్యకు ప్రాణభిక్షపెట్టాలి.
–వాంకుడోతు మహేందర్, కేశ్యతండా, గూడూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement