నేటి నుంచి కార్డుదారులకు అప్పుపై సరుకులు
Published Sat, Dec 3 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
–జేసీ హరికిరణ్
కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబరు నెల సరుకులను శనివారం నుంచి కార్డుదారులకు అప్పు ప్రాతిపదిక పంపిణీ చేయనున్నట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులతోను శుక్రవారం.. జేసీ సమీక్ష నిర్వహించారు. నగదు కొరత ఉన్నందును కార్డుదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. అప్పుపై అన్ని రకాల సరుకుల పంపిణీ తక్షణం అమలులోకి వస్తుందన్నారు. ఇంతవరకు సరుకలు తీసుకోని కార్డుదారులందరూ నేటి నుంచి నగదు చెల్లించకుండానే సరుకులు పొందవచ్చని తెలిపారు. డీలర్లు కూడ ఎట్టి పరిస్థితుల్లోను కార్డుదారులను నగదు అడుగరాదని ఆదేశించారు. జిల్లాలో 10.75లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండగా శుక్రవారం నాటికి దాదాపు 40శాతం పంపిణీ పూర్తి అయింది. మిగిలిన 60శాతం కార్డుదారులు అప్పుపై సరుకులు పొందాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, నందికోట్కూరు స్టాక్ పాయింట్ల పరిధిలో ఈ నెలలోనే త్వరలో అదనపు సరుకులు కందిపప్పు పెసరపప్పు, వేరుశనగ విత్తనాలు కిలో ప్యాకెట్లు మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు ఇస్తున్నామన్నారు. వీటిని కూడ అప్పుపై తీసుకోవచ్చని సూచించారు. అయితే జనవరి నెల సరకులు తీసుకునే సమయంలో ఈ బకాయిని చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. కార్డుదారుల నుంచి డబ్బులు తీసుకోకపోతే వచ్చే నెల డీడీలు కట్టడం కష్టం అవుతుందని డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలపగా.. ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జేసీ చెప్పారు.కార్యక్రమంలో డీఎస్‌ఓ తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement