డీలర్లు.. వేషాలు
డీలర్లు.. వేషాలు
Published Mon, Jan 16 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
సరుకుల పంపిణీలో అక్రమాలు
- ప్రదక్షిణలు చేస్తున్న కార్డుదారులు
- సరుకులు అయిపోయాయనే
సమాధానంతో సరి
- 15 వరకు షాపులు తెరవాలనే
నిబంధనకు పాతర
- ప్రజాపంపిణీలో యథావిధిగా దందా
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడని పరిస్థితి. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో డీలర్లు చేతివాటం చూపుతున్నారు. చౌక దుకాణాలను ప్రతి నెలా 15 వరకు తెరిచి ఉంచాలనే నిబంధనను గాలికొదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డుదారులు రేషన్ షాపులు చుట్టూ తిరుగుతున్నా సరుకులు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది కార్డుదారులు డీలర్ల నిర్లక్ష్యంతో రేషన్ సరుకులు పొందలేకపోయారు. కర్నూలులోనే వందలాది మంది కార్డుదారులు డీలర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంలోనూ ఇదే పరిస్థితి. కానుకల పంపిణీకి మొదట ఈ నెల 12 వరకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే చాలా మంది కార్డుదారులు పొందలేకపోవడంతో ఈ నెల 15 వరకు పంపిణీ చేసేలా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు వందలాది షాపుల్లో అమలుకు నోచుకోలేదు. కొత్త కార్డులకు కానుకలు ఇవ్వాల్సి ఉండగా 30శాతం కార్డుదారులకు నిరాశే మిగిలింది. ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ–పాస్ మిషన్‌లను తీసుకొచ్చినా యథావిధిగా కొనసాగుతున్నాయి.
జిల్లాలో 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్‌లనే బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టారు. ఇలాంటి డీలర్లు కర్నూలులోనే 100 మంది ఉన్నారు. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసిన కుంభకోణంలో 149 మంది డీలర్లను సస్పెండ్ చేసి వారి స్థానాల్లో ఇన్‌చార్జి డీలర్లను నియమించినా అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. సర్వర్‌కు లాక్ చేశారు.. ఇక అక్రమాలకు తావుండదని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కార్డుదారులు ఏ చౌకదుకాణం నుంచి అయిన సరుకులు తీసుకోవచ్చు. దీనినే పోర్టబులిటీగా వ్యవహరిస్తారు. చౌక దుకాణాలకు సరకులను కార్డుల సంఖ్యను బట్టి కేటాయిస్తున్నారు. పోర్టబులిటీ ప్రకారం డీలర్లకు సరుకులు ఇవ్వడం లేదు. నిబం«ధనల ప్రకారం ఈ నెల 15 వరకు షాపులను తెరచి ఉంచి కార్డులన్నింటికీ సరుకులు ఇవ్వాల్సి ఉంది. 15వ తేదీ వరకు సరుకులు ఇస్తారు కదా అని.. వారం, 10 రోజుల తర్వాత వెళ్లిన కార్డుదారులకు డీలర్లు మొండిచెయ్యి చూపుతున్నారు. సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపుతుండటం గమానార్హం. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత బియ్యం సరుకులు అయిపోయాయి అనే ప్రశ్నే రాదు. 15 వరకు సరకులు అలాగే ఉంచాలి. తర్వాత బ్యాక్‌లాగ్ చూపాల్సి ఉంది. కొందరు డీలర్లు పోర్టబులిటీ పేరుతో అదే షాపు పరిధిలోని కార్డుదారులకు మొండి చేయి చూపుతుండగా, మరికొందరు పోర్టబులిటీతో సంబంధం లేకుండానే సరకులు లేవు.. అలస్యంగా వచ్చారు.. అయిపోయాయి.. అంటూ వెనక్కి పంపుతుండటంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. షాపునకు ఉదయం పోతే సాయంత్రం రమ్మని, సాయంత్రం పోతే ఉదయం రమ్మని ఇలా రెండు మూడు రోజులు తిప్పుకొని తీరా సరకులు లేవు.. అయిపోయినాయని చెబుతుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసే అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. అధికారికంగా పోర్టబులిటీ లేదు. ఉంటే ఆ విధంగా షాపులకు సరకులు కేటాయిస్తారు. జిల్లాలో ఏ షాపునకు పోర్టబులిటీ ప్రకారం సరకులు ఇవ్వడం లేదు. కానీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కార్డుదారులను తిప్పుకొని చివరికి డీలర్లు చేతులెత్తేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అక్రమాల్లో కొన్ని...
– కర్నూలు నగరానికి చెందిన షేక్ మహమ్మద్‌కు ఆర్‌ఏపీ 138210834806 నెంబర్ రేషన్ కార్డు ఉంది. అయితే 130వ షాపు దగ్గరగా ఉండటంతో పోర్టబులిటీ కింద ఈ షాపులో సరకులు తీసుకుంటున్నారు. సరుకుల కోసం కార్డుదారుడు ఈ షాపు చుట్టూ తిరిగినా చివరకు సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపారు. 108వ షాపునకు సరుకుల కోసం వెళ్లగా అక్కడా మొండి చేయి చూపారు. ఇలా ఆయన జనవరి నెల సరుకులను కోల్పోయారు.
– కర్నూలుకు చెందిన ఈడిగ రేవతికి 129వ షాపులో కార్డు ఉంది. కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ 1382129బి0045. జనవరి నెల సరుకుల కోసం 129-2 షాపులోను, అటు పోర్టబులిటీ కింద సరుకులు తీసుకునేందుకు 130 షాపునకు వెళ్లారు. పలు సార్లు తిప్పుకున్నా చివరకు సరుకులు అయిపోయాయంటూ వెనక్కు పంపించారు.
– కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వీరన్నగౌడుకు జేఏబీ 131803500036 నెంబర్ కార్డు ఉంది. అయితే పోర్టబులిటీ కింద కర్నూలులో సరుకులు తీసుకుంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలను పోర్టబులిటీ కింద తీసుకునే అవకాశం లేదు. ఎక్కడ కార్డు ఉంటే అక్కడే కానుకలు తీసుకోవాల్సి ఉంది. కానుకల కోసం పెద్దపాడులోని డీలరు షాపునకు వెళితే నిరాకరించారు.
Advertisement
Advertisement