ఆరాధ్యుడి ఆరాధనకు అంకురార్పణ
ఆరాధ్యుడి ఆరాధనకు అంకురార్పణ
Published Wed, Aug 17 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
– రాయరు 345వ ఆరాధనోత్సవాలు ప్రారంభం
– కన్నుల పండువగా ధ్వజారోహణ
మంత్రాలయం: కురుస్తున్న విరుల వాన.. మోగుతున్న మంగళవాయిద్యాలు.. ధ్వనిస్తున్న వేద మంత్రోచ్ఛారణలు..దాససాహిత్య మహిళల హరిదాస కీర్తనలు, భజనలు.. భక్తుల హర్షధ్వానాల మధ్య శ్రీరాఘవేంద్రస్వామి 345వ సప్త రాత్రోత్సవాలు ప్రారంభయమ్యాయి. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ముందుగా గజరాజు స్వాగతం పలుకుతుండగా పీఠాధిపతి రాయరు మూల బందావన దర్శనం చేరుకుని విశేష పూజలు గావించారు. శ్రీమఠం ముంగిట గజరాజు, గోమాత, తురగ(అశ్వం)పూజ భక్తిశ్రద్ధలతో కానిచ్చారు. శ్రీమఠం ప్రాకార శిఖరాగ్రం నుంచి పూలు కురిపిస్తుండగా పీఠాధిపతి ధ్వజారోహణతో వేడుకలకు అంకురార్పణ పలికారు. అడ్మినిస్ట్రేటివ్, పీఆర్వో, క్యాస్, ఏఏవో, మేనేజర్ కార్యాలయాల్లో లక్ష్మి, రాయరు చిత్ర పటాలకు పూజలు చేశారు. రాత్రి డోలోత్సవ మండపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలు జరిపారు.
విశ్వమోహనుడి పర్వం : సుభుదేంద్రతీర్థులు, పీఠాధిపతి
శ్రీరాఘవేంద్రస్వామి ఉత్సవాలు కేవలం మంత్రాలయం మఠంలోనే కాకుండా విశ్వమంతటా నిర్వహించబడుతోందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పేర్కొన్నారు. వేడుకల ప్రారంభోత్సవంలో పీఠాధిపతి మాట్లాడుతూ భువనమోహనుడు రాయరు ఆరాధన రోజుల్లో భక్తులకు కరుణచూపుతో ఆశీర్వదిస్తారన్నారు. రాయరు మహిమలు అమోఘమన్నారు. భక్తుల కల్పతరువుగా ప్రాణకోటి సుభిక్షానికి మూల గురువుగా నిలుస్తారన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భక్తులు, పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఏడు రోజుల పాటు భక్తులకు సకల సౌకర్యాలు క్షేత్రంలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి, గురువు గిరియాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ మునిస్వామి పాల్గొన్నారు.
శ్రీమఠంలో ఎంపీ బుట్టారేణుక
రాఘవేంద్రస్వామి దర్శనార్థం బుధవారం కర్నూలు ఎంపీ బుట్టారేణుక మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకుని రాఘవేంద్రుల మూల బందావనంకు పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రుల జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. మఠం మేనేజర్ శ్రీనివాస రావు పూర్ణకుంభంతో ఎంపీకి ఆహ్వానం పలికారు. ఆమెతోపాటు సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కష్ణ ఉన్నారు.
Advertisement
Advertisement