రజాక్ విద్యార్థి
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఉపాధ్యాయులకు సూచించారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మైనారిటీ విద్యార్థులతో శనివారం మాటామంతీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పినపుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.
విద్యార్థులతో మాటామంతీ
అంతకుముందు మంత్రి ప్రకాశ్ జవదేకర్ విద్యార్థులతో మాట్లాడారు. అబ్దుల్ అనే విద్యార్థి తాను వాలీబాల్ బాగా ఆడతానని అనగా.. స్పోర్ట్స్ చానల్స్ చూసి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. చాలా దూరం నుంచి వచ్చే విద్యార్థులు ఎవరని మంత్రి ప్రశ్నించగా జుబేదా, సమీరా తాము చాలా దూరం నుంచి నడిచి వస్తామని చెప్పారు. తాను కూడా చిన్నపుడు స్కూల్‌కు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంగ్లిష్ అంటే ఇష్టమన్న రజానాకు.. రోజూ రెండు ఇంగ్లిష్ పేపర్లు చదవాలని, ఇంగ్లిష్ టీవీ చానల్స్ చూడాలని సూచించారు.
సంగీతమంటే ఇష్టమని చెప్పిన గౌసియా బేగంను పాడమని కోరగా.. ఆ విద్యార్థిని ‘దిల్ దియా హై.. ఏ వతన్ తేరే లియే’ పాట వినిపించింది. సయ్యద్ రజాక్ అనే విద్యార్థి కేంద్ర మంత్రి దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు. మల్కాజ్‌గిరి నుంచి స్కూల్‌కు రోజూ 7 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి వచ్చే రజాక్‌ను భవిష్యత్‌లో ఏం చేస్తావని ఆయన అడిగారు. ‘మా బస్తీలో చదువుకోలేని వారికి చదువు చెప్తానని... ప్రస్తుతం నా స్నేహితుడు షరీఫుద్దీన్‌కు చెబుతున్నా’నని అన్నాడు. రజాక్‌ను అభినందించిన మంత్రి.. ‘మళ్లీ వచ్చి నిన్ను కలుస్తా’నని విద్యార్థికి చెప్పారు.