విద్యా విధానానికి పంచ సూత్రాలు | five principles of the educational system | Sakshi
Sakshi News home page

విద్యా విధానానికి పంచ సూత్రాలు

Published Sun, Apr 9 2017 3:30 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

విద్యా విధానానికి పంచ సూత్రాలు

విద్యా విధానానికి పంచ సూత్రాలు

- ప్రజ్ఞా భారతి సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌
- పరిశోధన విద్యార్థులకు నెలకు రూ.75 వేల ఉపకార వేతనం


సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఉద్ఘాటించారు. ప్రధానంగా ఐదు సూత్రాలతో ఈ విద్యా విధానాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విలువైన, సౌలభ్యమైన, సమానమైన, నాణ్యమైన, జవాబుదారీతనంతో కూడిన విద్యను ప్రజలందరికీ అందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. శనివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యా భవన్స్‌ ఆడిటోరియంలో జరిగిన ప్రజ్ఞా భారతి సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా జవదేకర్‌ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తరగతి గదిలో అల్లరి చేసే విద్యార్థులను ఆందోళన కలిగించేలా వారించొద్దని సూచించారు.

ఆవిష్కరణలకు ఇక్కడే పేటెంట్‌..
‘ఉన్నత చదువులు చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వలసలు కడుతున్నారు. అక్కడే పరిశోధనలు చేసి ఆవిష్కరించిన వాటిపై పేటెంట్‌ పొందుతున్నారు. దీంతో మన దేశ సంపద పొరుగు దేశాల పాలవుతోంది. ఇకపై ఇలా జరగ కుండా స్వదేశంలోనే పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. వారి ఆవిష్కరణలకు ఇక్కడే పేటెంట్‌ వచ్చేలా చూస్తాం. ప్రతిభావంతులైన పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.75 వేల ఉపకార వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల బడ్జెట్‌ లో పరిశోధన విద్యకు రూ.20 వేల కోట్లు కేటా యించాం. వచ్చే మూడేళ్లలో నిధులు మరింత ఎక్కు వగా కేటాయించి సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాం. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. దీనిపై అమెరికా సెనెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. అంతటి సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో ఉండటం గర్వంగా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం మొబైల్‌ ఫోన్లు వాడటం మొదలు పెట్టిన మనం.. ఇప్పుడు ఇరవై నిమిషాలు దాన్ని విడిచి ఉండలేకపోతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం మనల్ని అంతలా దగ్గరకు తీసుకుంది’ అని వివరించారు.

దారి మళ్లించే యత్నం చేశారు: దత్తాత్రేయ
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, వామపక్ష మేధావులు తమ చాకచక్యంతో దేశాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారని, ఇతర దేశాల ఆశయాలను ఇక్కడ రుద్దేలా వ్యవహరించారని అన్నారు. అలాంటి సమయంలో ప్రజ్ఞా భారతి వంటి సంస్థలు దేశ సంస్కృతిని కాపాడేలా కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేశాయని చెప్పారు. దేశంలో వెయ్యిన్నరకు పైబడి భాషలు మాట్లాడే వారున్నా మనమంతా ఒకే కుటుంబ సభ్యుల్లా కొనసాగుతున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ సూపర్‌ పవర్‌గా మారుతుందని తెలిపారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై విస్తృత చర్చలు నిర్వహిస్తున్న ప్రజ్ఞా భారతి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందకరంగా ఉందన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీశ్‌ రెడ్డికి ప్రజ్ఞా పురస్కార్‌ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే, ప్రజ్ఞాభారతి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ టి.హనుమాన్‌ చౌదరి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఎస్‌.రామచంద్రం, ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement