స్లూయిస్ గేట్లు తెరిచేందుకు రంగం సిద్ధం
స్లూయిస్ గేట్లు తెరిచేందుకు రంగం సిద్ధం
Published Wed, Apr 19 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసేందుకు రివర్స్ స్లూయిస్ గేట్ల ఆపరేషన్‌కు ఇంజినీర్లు సిద్ధమయ్యారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చిన విషయం తెల్సిందే. గత సోమవారం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా బుధవారం వరకు రెండు టీఎంసీలకు పైగా నీటిని విడుదల చేశారు. 800 అడుగులకు నీటిమట్టం గురువారం చేరుకోనుంది. 800 అడుగులకు చేరుకుంటే విద్యుత్ ఉత్పాదనతో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. కాబట్టి మిగతా 7 టీఎంసీల నీటిని రివర్ స్లూయిస్‌గేట్ల ద్వారా గురువారం రాత్రి నుంచి శుక్రవారం లోగా విడుదల చేసేందుకు డ్యాం ఇంజినీర్లు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జలాశయంలో 29.5997 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 801.30అడుగులుగా నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.961 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 6,907 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. పగటిపూట ఉష్ణోగ్రతులు 41.31 డిగ్రీలుగా ఉండడంతో జలాశయంలోని 170 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.
Advertisement