కొనుగోళ్లు సరే.. చెల్లింపులేవి..!
చివరి నీటి తడుల కోసం అదనంగా మరో రూ.10 వేల వరకు ఖర్చు పెట్టి పంటను దక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.9 వేల వరకు పలికింది. దీంతో రైతులు కొంత ఊరట చెందారు. ఈ సారి పంట చేతికొచ్చిన తరువాత మార్కెట్ ధర క్వింటా రూ.4 వేలకు పడిపోవడం.. రైతులు ఆందోళన చెందడం మొదలు పెట్టారు. రైతుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. జిల్లాలో ఫిబ్రవరి 4న వేలం కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో తొలిదశలో రాజంపల్లి, దర్శి, మారెళ్ళ, మార్టూరు, సజ్జపురం, వెల్లలచెరువు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాలు, డీసీఎంఎస్‌ల సహకారంతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత మరో 19 కేంద్రాలలో ఏర్పాటు చేశారు. క్వింటాకు రూ.5,050 మద్దతు ధరతో రైతుల నుంచి కొత్త కందులను కొనుగోలు చేశారు. మొత్తం 10,172 మంది రైతుల నుంచి కందులు కొనుగోలు చేశారు. మొత్తం 3,32,207 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. వీరికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం రైతులందరికీ రూ.167 కోట్లు రావాల్సి ఉంది.
గత నెల 12వ తేదీతో కందుల కొనుగోలును మార్క్‌ఫెడ్ నిలిపివేసింది. అప్పటి వరకు దశల వారీగా రైతులకు రూ.104 కోట్ల వరకు రైతుల ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా జమ చేశారు. ఇంకా సుమారుగా రూ.50 కోట్ల వరకు రైతులకు జమచేయాల్సి ఉంది. వేలం కేంద్రాలను నిలిపేసి 20 రోజులకు పైగా అవుతోంది. ఇప్పటి వరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వారి ఖాతాలకు ప్రభుత్వం జమచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంట సాగు సమయంలో.. పంట కోత, నూర్పిళ్ల కూలీలకు డబ్బులు చెల్లించలేని స్థితిలో రైతులున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.రైతులకు చెల్లించాల్సిన బకాయిల గురించి మార్క్‌ఫెడ్ డీఎం దృష్టికి ‘సాక్షి’ తీసుకురాగా మొత్తం రూ.167 కోట్లకు గాను రూ.104 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన బకాయిలను రైతుల ఖాతాలకు జమచేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని జిల్లా మేనేజర్ లక్ష్మీ తాయరమ్మ తెలిపారు.