ఘాటు తగ్గిన మిర్చి
ఘాటు తగ్గిన మిర్చి
Published Mon, Oct 17 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
– ధర పతనంతో రైతుల కుదేలు
– గత సీజన్‌లో పది కిలోలు రూ. 500
– ప్రస్తుతం రూ.80
– కూలి ఖర్చులు కూడా రాక వదిలేస్తున్న రైతులు
ఆచంట : అన్నదాతను కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అయితే అతివష్టి లేకపోతే అనావష్టి. రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పడిస్తున్నా ఫలితం మాత్రం పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దిగుబడులు బాగుంటే ధరలు ఉండటం లేదు. ధర ఉంటే ప్రకతి వైపరీత్యాలు తెగుళ్లు. ప్రతి సీజన్‌లోనూ రైతుకు ఏదో ఒక విధంగా ఆపద వచ్చి పడుతూనే ఉంది. ఈసారి పచ్చిమిర్చి పండించిన రైతులదీ ఇదే దుస్థితి.
జిల్లాలో 3,500 వేల ఎకరాల్లో సాగు
ఈ వేసవిలో పచ్చిమిర్చి ధర హోల్‌సేల్ మార్కెట్లో పది కేజీలు రూ. 400 నుంచి రూ.500 పలికింది. ధర బాగుండడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో రైతులు మిర్చి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపారు. ప్రస్తుతం జిల్లాలో 3,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గోదావరి తీరప్రాంతంలోని మండలాలు, లంక భూములతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో ఎక్కువగా మిర్చిని సాగు చేస్తున్నారు.
ధర పతనం.. రైతుల దైన్యం
మిర్చి ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పతనమైంది. వేసవి సీజన్‌లో పది కేజీలు రూ.400 పైగా పలకగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరితో పోలిస్తే పచ్చిమిర్చి ఖర్చుతో కూడిన సాగు. ఎకరాకు సుమారు రూ.40 వేలుపైనే ఖర్చవుతుంది.
నెలా 15 రోజుల వరకూ పంట కాపుకు రాదు. దాదాపు నాలుగు నెలల వరకూ కోతలు కోయవచ్చు. రైతులు ఆశించినట్టుగానే ఈసారి మిర్చిసాగు ఆశాజనకంగానే ఉంది. చీడ పీడల ప్రభావం ఉన్నా అది దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపలేదు. గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. ఎకరాకు మూడు క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్లను ముంచెత్తింది. దీంతో ధరలు నేలచూపులు చూశాయి.
మొక్కలనే కాయలు వదిలేస్తున్న రైతులు
ప్రస్తుతం మార్కెట్లో పలుకుకుతున్న ధరలు చూస్తుంటే మిుర్చి కోయకుండా వదిలివేయడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. పంటను నెలకు మూడుసార్లు వరకూ కోత కోస్తారు. ఎకరాకు కనీసం ఆరుగురు కూలీలను వినియోగిస్తే రెండు రోజులపాటు కోత సాగుతుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.200 చెల్లించాలి. రెండు రోజుల పాటు కోత సాగితే రూ.2,400 కోత కూలి ఖర్చు అవుతుంది. దిగుబడి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకూ వస్తోంది. మార్కెట్లో క్వింటాల్ రూ.700– రూ.800 మధ్య పలుకుతోంది. మూడు క్వింటాళ్లకు రూ.2,100 నుంచి రూ.2,400లోపు ఆదాయం వస్తోంది. లాభం సంగతి అలా ఉంచితే రవాణా ఖర్చులకు చేతి సొమ్ము వదులుతోంది. రెండు రోజుల శ్రమా వథాగా మారుతోంది. దీంతో రైతులు ఎందుకొచ్చిందిలే అని తయారైన కాయలను మొక్కలనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం పరువుకోసం పంటను కోస్తున్నారు.
దళారుల దందా
ఆరుగాలం శ్రమించిన రైతులకు ఏమీ మిగలకపోయినా దళారులు మాత్రం దండుకుంటున్నారు. రైతుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్న కమీషన్‌దారులు చిరు వ్యాపారులకు పది కేజీలు రూ.120 వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులు చిల్లరగా కేజీ రూ.20 చేసి విక్రయాలు సాగిస్తున్నారు.
30 ఏళ్లుగా సాగు చేస్తున్నా
ఇతడు పెనుగొడం మండలం మదనగూడెంకు చెందిన కౌలు రైతు కుడిపూడి వెంకటేశ్వరరావు. 30 ఏళ్లుగా పచ్చిమిర్చి సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది 8 కుంచాల్లో సాగు చేశాడు. ఎకరాకు 35 బస్తాలు మక్తా చెల్లించేలా రైతుతో ఒప్పందం చేసుకున్నాడు. అప్పులు చేసి 30 వేలకుపైనే పెట్టుబడులు పెట్టాడు. పంట బాగా పండింది. దిగుబడులు బాగున్నాయి. కోసిన కాయలు సిద్ధాంతం మార్కెట్‌కు తీసుకెళితే పది కేజీలు రూ.70 చేసి కొనుగోలు చేశారు. దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధర లేదని కమీషన్ వ్యాపారులు చెప్పుకొచ్చారు. కనీసం కూలీలకు కూడా సొమ్ములు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లాభం రాకున్నా పరువు పోకూడదని సాగు చేస్తున్నానని ఆవేదనతో చెప్పారు.
‘ కుడిపూడి వెంకటేశ్వరరావు, మదనగూడెం, పెనుగొండ మండలం
Advertisement
Advertisement