పచ్చిబుట్టకు తగ్గిన ధర | Reduced price | Sakshi
Sakshi News home page

పచ్చిబుట్టకు తగ్గిన ధర

Published Wed, Aug 10 2016 10:47 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

పచ్చిబుట్టకు తగ్గిన ధర - Sakshi

పచ్చిబుట్టకు తగ్గిన ధర

మోర్తాడ్‌: పచ్చిబుట్ట (మొక్కజొన్న) సాగు చేసిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. పంట పండించిన రైతుకు గిట్టుబాటు కాకపోగా, దళారులు మాత్రం ఇష్టమొచ్చిన ధరలు నిర్ణయిస్తూ దండుకుంటున్నారు. పచ్చిబుట్టకు పట్టణాల్లో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. కాల్చి విక్రయించే కంకులతో పాటు పచ్చి కంకులను పిండి రుబ్బుకొని పిండి పదార్థాలు చేసుకుంటారు. పచ్చి మొక్కజొన్న కంకులకు డిమాండ్‌ ఉండడంతో చాలా మంది రైతులు ఖరీఫ్‌కు కొద్ది ముందు మే నెలలోనే మొక్కజొన్న సాగు చేశారు. అయితే, మండుటెండల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంట పండించిన రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దళారులు అమాంతం ధరలు తగ్గించేస్తూ దండుకుంటున్నారు. మొన్నటి వరకు ఎకరా విస్తీర్ణం పంటకు రూ.35 వేలు చెల్లించిన దళారులు.. ఇప్పుడు రూ.25 వేలు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. దీంతో పచ్చి బుట్ట కోసం సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాధారణంగా జూన్, జూలై నెలల్లో సాగు చేసే మొక్కజొన్నను మాత్రం పంట ఎండిన తరువాత విక్రయిస్తారు. ఈ ఖరీఫ్‌ సీజనుకు గాను జిల్లా వ్యాప్తంగా దాదాపు 55 వేల హెక్టార్‌లలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సగం పంట పచ్చిబుట్ట రూపంలోనే విక్రయిస్తారు. జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్‌ మండలాల నుంచి హైదరాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, వరంగల్‌ తదితర పట్టణాలకు జోరుగా మొక్కజొన్న కంకులు ఎగుమతి అవుతున్నాయి. మెట్‌పల్లి, పెర్కిట్‌లలోని హోల్‌సెల్‌ వ్యాపారులు నేరుగా రైతుల నుంచి హోల్‌సెల్‌గా పంటను కొనుగోలు చేస్తున్నారు.
అయితే, మొదట్లో పంట చేతికొచ్చిన రైతులకు వ్యాపారులు ఎకరాకు రూ.35 వేలు చెల్లించారు. ప్రస్తుతం పంట పెద్ద మొత్తంలో చేతికి రావడంతో వ్యాపారులు ధర తగ్గించేశారు. రూ.25 వేల కంటే ఎక్కువిచ్చేది లేదని కరాఖండీగా తేల్చి చెబుతున్నారు. ఒకేసారి ధర రూ.10 వేలు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో 10–15 వేల కంకులు లభిస్తాయి. పచ్చి కంకిని వ్యాపారులు రూ.5కు విక్రయిస్తుండగా, కాల్చిన కంకిని రూ.10కి విక్రయిస్తున్నారు. రిటైల్‌ వ్యాపారులకు, వినియోగదారులకు ధరలో తేడా లేకపోయినప్పటికీ రైతుల వద్దకు వచ్చే సరికి మాత్రం భారీగా తేడా ఏర్పడింది. 
మార్కెట్‌లో మొక్కజొన్న పచ్చికంకులకు డిమాండ్‌ ఎంత మాత్రం తగ్గకపోయినా దళారుల కారణంగా రైతులు నష్టాలు మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండిన మక్కలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. పచ్చి కంకుల విక్రయానికి మాత్రం మార్కెట్‌ సౌకర్యాలు లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కోతకు వచ్చిన మొక్కజొన్న పంటను ఎండిబెట్టి మక్కలను విక్రయిద్దామని భావిస్తున్నా, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైతులు వ్యాపారులు చెప్పిన ధరకు పచ్చి బుట్టను విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా కరువుతో నష్టపోయిన అన్నదాతలు.. ప్రస్తుతం దళారుల దగాతో నష్టపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement