
మద్యం తాగించి గొంతు కోశాడు
యైటింక్లయిన్ కాలనీ(కరీంనగర్) : ఓ యువకుడికి సమీప బంధువే చిత్తుగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక తలపై ఇనుప రాడ్తో కొట్టి, గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని యైటింక్లయిన్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన ఆకుల సంతోష్ తన తల్లి కర్మకోసం ఉదయం యైటింక్లయిన్కాలనీలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి వచ్చాడు. తన స్నేహితుడు జంగిటి ప్రవీణ్తో కలిసి మద్యం సేవించాడు. తర్వాత ఇద్దరూ కలిసి సమీప బంధువు ప్రసాద్(32) వద్దకు వెళ్లారు. ముగ్గురు కలిసి స్థానికంగా మద్యం కొనుగోలు చేసి యైటింక్లయిన్కాలనీ-పోతనకాలనీ మధ్య నున్న జల్లారం వాగు ఒడ్డున ఉన్న పొదల వద్దకు వెళ్లి సేవించారు.
ఈ క్రమంలో పాత గొడవల ప్రస్తావన రావడంతో సంతోష్, ప్రసాద్ మద్య మాటామాటా పెరిగింది. ఆగ్రహించిన సంతోష్ తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్తో ప్రసాద్ తలపై కొట్టాడు. స్పృహ తప్పడంతో కత్తిలో గొంతు కోసి, కడుపులో పొడిచాడు. సంతోష్‌కు ప్రవీణ్ సహకరించాడు. ప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతరం నిందితుల కోసం పట్టణంలో గాలించారు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కొంతకాలంగా కాపురానికి రావడంలేదని తెలిసింది.
పథకం ప్రకారమే హత్య..?
రెండేళ్లుగా ఆకుల సంతోష్, ప్రసాద్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ప్రసాద్ అడ్డు తొలగించుకునేందుకు సంతోష్ పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం తన స్నేహితుడు జంగటి ప్రవీణ్ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు సంతోష్ అవివాహితుడు. హైదరాబాద్ మెట్రోరైల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఉదయం ఇద్దరు యువకులొచ్చారు..
మా తమ్ముడి కోసం ఇద్దరు యువకులు వచ్చారు. ప్రసాద్ ఎక్కడున్నాడు.. అంటూ శనివారం ఉదయం ఇద్దరు యువకులు స్కూటీపై మా ఇంటికి వచ్చారు. లేడని చెప్పడంతో వెళ్లిపోయారు. తర్వాత కాసేపటికే ఇంటికి వచ్చిన మా తమ్ముడు టిఫిన్ చేసి బీరువాల షాపులో పనిచేయడానికి వెళ్లాడు. రోజూ మధ్యాహ్నం భోజనానికి వచ్చే వాడు రాలేదు. ఆతర్వాత చనిపోయాడని తెలిసింది.
-మృతుడి అక్క రమాదేవి