విచారణాధికారిగా ఆర్డీఓను తొలగించాలి
-
ఐఏఎస్ అధికారితో విచారణ జరపాలి
-
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీసీఆర్
నార్తురాజుపాలెం(కొడవలూరు):
కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి భూకబ్జా విచారణాధికారిగా ఉన్న ఆర్డీఓను తొలగించి, ఆ స్థానంలో నిజాయితీ గల ఐఏఎస్ అధికారిని నియమించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు కలెక్టర్‌ను కోరారు. నార్తురాజుపాలెంలోని వీసీఆర్ అతిథి గహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేకు పట్టాదారుపాసుపుస్తకాలు మంజూరుచేసింది ఆర్డీఓ అయిన నేపథ్యంలో ఆయననే విచారణాధికారిగా నియమించడం సబబుకాదన్నారు. పీఓబీలో ఉన్న భూములకు పట్టాలు పొందిన ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆ భూములు నిషిద్ధ భూములు కాదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ భూములు పీఓబీలో లేనపుడు 2004 నుంచి 2016 దాకా ఎందుకు పాసు పుస్తకాలు తీసుకోలేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చి ఈ ఏడాది ఏప్రిల్‌లో పాసు పుస్తకాలు పొందారన్నారు. గత నెల్లో కూడా సబ్‌రిజిస్ట్రారు అవి నిషిద్ధ భూములని రాత పూర్వకంగా ఇచ్చారని తెలిపారు. 2011లో కలెక్టర్‌గా ఉన్న రాంగోపాల్ ఆ భూములను రిజర్వు చేశారని పోలంరెడ్డి శనివారం మాట్లాడారన్నారు. అలాంటప్పుడు 2016లో ఎలా పాసు పుస్తకాలు పొందారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొడవలూరు పార్టీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య మాట్లాడుతూ పీఓబీ భూములపై అబద్ధాలతో వక్రీకరించిన ఎమ్మెల్యే నార్తురాజుపాలెంలో తన తల్లి సమాధి కోసం ఆక్రమించిన 60 సెంట్ల కాలువ పోరంబోకు స్థలం విషయంపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా రైతు విభాగం కోశాధికారి మాతూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 2004 కి ముందు ప్రసన్నకుమార్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే చాలని మాట్లాడిన పోలంరెడ్డి ఆయనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కలువ బాలశంకర్‌రెడ్డి, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు మండలాల కన్వీనర్లు మావులూరి శ్రీనివాసులురెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కొండా శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు.